సినిమా థియాటర్లలో నిబంధనల మార్పు

శ్రీకాకుళం, జూలై 17 : సినిమా థియాటర్లలో నిబంధనలు మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో 44 సినిమా థియాటర్లు ఉండగా ప్రస్తుతం ఉన్న థియాటర్లన్నీ 10 మీటర్ల నుంచి 15 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇకపై ఎత్తును పరిశీలించనున్నారు. 10 మీటర్ల ఎత్తు ఉంటే 300 మందికి సరిపోయే కుర్చీలు ఉంచాలి. అగ్నిమాపక యంత్రాలను కూడా అందుబాటులో ఉంచాలి. 15,000 లీటర్ల నీటి ట్యాంకు, నింషానికి 900 లీటర్ల నీరు వచ్చే విధంగా పంపు ఏర్పాటు చేయాలి. 10 మీటర్లు దాటి 15 మీటర్ల వరకు ఎత్తు ఉంటే పైన చెప్పిన వాటితో పాటు అదనంగా ఆటోమేటిక్‌ అళారం, 50,000 లీటర్ల అండర్‌గ్రౌండ్‌ ట్యాంకు, ఎలక్ట్రికల్‌ పంప్‌, డీజిల్‌ పంప్‌, నిమిషానికి 2,250 లీటర్ల నీరు వచ్చేలా పంపు ఏర్పాటు చేసుకోవాలి. 180 ఎల్‌.పి.ఎం. జాకీ పంపు ఉండాలి. 450 ఎల్‌.పి.ఎం. పంపు సినిమాధియాటర్‌ పైబాగంలో ఏర్పాటు చేయాలి. సినిమాథియాటర్‌కు మూడువైపులా ఆరు మీటర్ల స్థలం ఉండాలి. ముందుబాగంలో 10 మీటర్ల ఖాలీ స్థలం ఉంచాలి.
జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీ ఎంపిక: సినిమాథియాటర్లలో మార్పులు చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జివో విడుదల చేసింది. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఛైర్మెన్‌గా హైపవర్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ చర్చించి జిల్లా స్థాయిలో ఒక కమిటీని వేశారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఈ కమిటీని నియమించారు.
కమిటీ ఇదే: ఛైర్మెన్‌గా జాయింట్‌ కలెక్టర్‌, సభ్యులుగా జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్‌, పురపాలక సంఘం కమిషనర్‌, ఆర్‌ అండ్‌ బి ఎస్‌.ఈ. (లేక) ఈఈ, ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎస్‌.ఇ., జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఉంటారు. ఈ కమిటీ సమావేశమై సినిమాథియాటర్లలో లోపాలుంటే లైసెన్స్‌ అధారిటీ దృష్టికి సమస్యను తీసుకెల్తారు.