సిపిఐకి దేవరకొండతో సరిపెట్టేస్తారా?

పొత్తుల లెక్కలు తేలకపోవడంతో కార్యకర్తల్లో అయోమయం

నల్లగొండ,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): ఉద్యమాల పురిటిగడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టులు మరోమారు వేర్వేరుగానే పోటీ చేయనున్నారు. సిపిఎం వేరు కుంపటి పెట్టగా సిపిఐ మాత్రం మహాకూటమిలో భాగస్వామ్యం అయ్యింది. అయితే కూటమి సీట్ల పంచాయితీ తేలకపోవడంతో ఎక్కడెక్డ నుంచి సిపిఐ పోటీ చేసేది తేలడం లేదు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పోటీ చేయగా, దేవరకొండ నుంచి విజయం సాధించింది. దేవరకొండ నుంచి గెలిచిన రవీంద్ర కుమార్‌ తరవాత టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడాయన తిరిగి టిఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు స్థానాలను కోరుతోంది. ఈ సారి ఆలేరు, మునుగోడు, దేవరకొండ నుంచి పోటీ చేయాలని సంస్థాగతంగా నిర్ణయించుకుంది. ఇంకా పొత్తులు ఖరారు కాకపోవడం, ఏ స్థానాల్లో పోటీ చేస్తామో తేలకపోవడంతో సీపీఐ కేడర్‌ అయోమయంలో పడింది.

మరోవైపు తాము కోరుతున్న స్థానాల్లో అప్పుడే కాంగ్రెస్‌ ఆశావహులు ప్రచారం కూడా మొదలు పెట్టడడంతో సీపీఐ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. మిత్ర ధర్మాన్ని పాటించకుండా, తాము గతంలో ప్రాతినిధ్యం వహించిన.. ఈ సారి కోరుతున్న స్థానాల్లో అపుడే ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

దేవరకొండలో గెలిచి రవీంద్రకుమార్‌ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. సీపీఐ ఈ స్థానాన్ని తమ సిట్టింగ్‌ నియోజకవర్గంగానే భావిస్తోంది. ఇక్కడి నుంచి మధ్యలో ఒకటీ రెండు సార్లు మినహాయిస్తే, అత్యధిక కాలం సీపీఐ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ సారి కూడా దేవరకొండ టికెట్‌ను సీపీఐ కోరుకుంటోంది. కానీ, కాంగ్రెస్‌ నాయకత్వం ఇక్కడ పలువురికి ఆశ పెట్టడంతో కనీసం ముగ్గురు కాంగ్రెస్‌ నేతలు టికెట్‌ తమదే అన్న విశ్వాసంలో ఉన్నారు. ఒకరిద్దరు ప్రచారం కూడా చేస్తున్నారు. మరో వైపు మునుగోడులోనూ సుదీర్ఘకాలం సీపీఐ ఎమ్మెల్యేలే ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెబల్‌ బరిలో ఉండడంతో ఆ పార్టీ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లోనూ మునుగోడు టికెట్‌ ఆశిస్తోంది. కానీ, ఇక్కడి నుంచి కూడా నలుగురైదుగురు కాంగ్రెస్‌ నాయకులు టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. మరో వైపు శాసనమండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రచారం కూడా మొదలు పెట్టారు. సీపీఐ ఈ సారి ఆలేరును కూడా ఆశిస్తోంది. కానీ, ఇక్కడి నుంచి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ టికెట్‌ రేసులో ఉన్నారు. మొత్తంగా దేవరకొండ, మునుగోడు, ఆలేరుల్లో కాంగ్రెస్‌ నుంచి బలమైన నాయకులే టికెట్‌ కోరుతుండ డంతో ఈ మూడింటిలో సీపీఐకి ఏ స్థానాలు దక్కుతాయో ఇదమిద్దంగా తేలడం లేదు. కేవలం దేవరకొండతో సరిపెట్టేలా కనిపిస్తోంది

తాజావార్తలు