సియాసిత్ ఉర్దూ పత్రిక ఎండీ జహీరుద్దీన్‌ అలీ ఖాన్‌ ఇక లేరు

Gaddar f.jpeg

హైదరాబాద్ : ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియ ల్లో విషాదం చోటుచేసుకుంది. అల్వాల్‌లోని మహాబోధి స్కూల్‌లో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన గద్దర్ అత్యంత సన్నిహితుడు, సియాసిత్ ఉర్దూ పత్రిక ఎండీ జహీరుద్దీన్‌ అలీ ఖాన్‌ (63) తుదిశ్వాస విడిచారు. గద్దర్‌ను కడసారి చూడటానికి భారీగా అభిమానులు, కళాకారులు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఒక్కసారిగా జనాలు పెరగడంతో తోపులాట జరిగింది. తోపులాటలో కిందపడిపోయిన జహీరుద్దీన్‌‌కు ప్రాథమిక చికిత్స చేసి.. ఆస్పత్రికి తరలించే లోపే కన్నుమూశారు. ఈయన కూడా తెలంగాణ కళాకారుడే. గద్దర్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొని సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు.ఆదివారం ఉదయం జరిగిన విద్యావంతుల వేదిక సదస్సులో కూడా జహీరుద్దీన్ పాల్గొన్నారు. గద్దర్ చనిపోయారని తెలుసుకున్న జహీర్ హుటాహుటిన అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటి నుంచి గద్దర్ అంత్యక్రియలు ముగిసే వరకూ వెన్నంటే ఉన్నారు. అయితే మహాబోధి స్కూల్ వద్ద స్థలం సరిపోకపోవడం.. పోలీసులు ముందుగానే హెచ్చరించినా జనాలు తోసుకుని మరీ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో సొమ్మసిల్లి కిందపడిపోయిన ఆయన.. ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు. జహీరుద్దీన్ హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, పత్రికా ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు.