సిరియాపై ఫ్రాన్స్‌ ప్రతీకార దాడులు

1
– జనవాసాల బాంబుల మోతలు

న్యూఢిల్లీ, నవంబర్‌16(జనంసాక్షి):

ఉమ్మడిపోరు చేయడం ద్వారా ఐసిఎస్‌ను అంతమొందిస్తామని ప్రకటించిన మరుసటి రోజే ఫ్రాన్స్‌ ప్రతీకార దాడులకు దిగింది. పారిస్‌లో ఐఎస్‌ ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండతో రగిలిపోతున్న ఫ్రాన్స్‌ ప్రతీకార దాడులకు పాల్పడింది. జన వాసాలపై బాంబుల మోతలు మోగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరంపై ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 127 మందికి పైగా అమాయక పౌరులు మృతిచెందారు. ఫ్రాన్స్‌కు ఐరోపా దేశాలుమద్దతు ప్రకటించిన మరుసటి రోజే ఫ్రాన్స్‌ దాడులకు దిగడం విశేషం. ఈ దాడులకు ప్రతీకారంగా ఆదివారం రాత్రి సిరియాలోని రక్కా నగరంపై ఫ్రాన్స్‌ వైమానిక దాడులకు పాల్పడింది. అమెరికా సహాయంతో 10 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో స్థానిక ఐసిస్‌ కమాండ్‌ కేంద్రం, జిహాదీ శిక్షణా శిబిరం సహా ఫుట్‌బాల్‌స్టేడియం, మ్యూజియం ధ్వంసమయ్యాయి. ఈ దాడులతో  ఫ్రాన్స్‌ ఉగ్రవేట మొదలుపెట్టింది. జెట్‌ బాంబులతో సిరియాను టార్గెట్‌ చేసింది. పారిస్‌ ఘటనతో పడగెత్తిన ఫ్రాన్స్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. సిరియాలో ఐసిస్‌కు పట్టున్న ప్రాంతాలపై ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. ఉత్తర సిరియాలోని రక్కా ప్రాంతంలో రెండు టార్గెట్లపై సుమారు 20 బాంబులను జారవిడిచింది. కమాండ్‌ సెంటర్‌, ఆర్మ్స్‌ డిపో, రిక్రూట్‌ పోస్ట్‌, ట్రైనింగ్‌ క్యాంపులపై వైమానిక దాడులు చేసినట్లు ఫ్రాన్స్‌ రక్షణ శాఖ పేర్కొంది. జోర్డాన్‌, యూఏఈ నుంచి 12 విమానాలు దాడులకు వెళ్లినట్లు ఫ్రెంచ్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. రక్కా కేంద్రాలను టార్గెట్‌ చేయాలని గత శనివారం ఫ్రాన్స్‌ మంత్రివర్గం నిర్ణయించింది. ఫ్రాన్స్‌పై ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో మొత్తం 129 మంది మృతి చెందగా..మరో 300 మంది గాయపడ్డారు. గత ఏడాది అమెరికాతో కలిసి ఫ్రాన్స్‌ వైమానిక దాడుల్లో పాల్గొంది. అయితే ఈ సారి ఆ దాడులను మరింత పెంచింది. యూరోజోన్‌ ప్రాంతంలో తనకున్న పట్టుతో ఫ్రాన్స్‌ ఆ దాడులను భీకరంగా మార్చింది. దాడుల కోసం ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని అగ్రదేశం అమెరికాతో పంచుకుంటోంది ఫ్రాన్స్‌. యుద్ధ విమానాలు ఎక్కడెక్కడ దాడి చేయాలన్న అంశంపై రెండు దేశాలు సమాచారాన్ని విశ్లేషిస్తున్నాయి. రహస్య సమాచారాన్ని ఫ్రాన్స్‌తో పంచుకునేందుకు అమెరికా తన నిబంధనలను సడలించింది. దీంతో పటిష్టమైన ఇంటెలిజెన్స్‌ సమాచారం ఉండే అమెరికాతో ఇప్పుడు ఫ్రాన్స్‌ కూడా అగ్ర పీఠాన్ని ఆక్రమించనుంది. ఉగ్రవాదంపై పోరు అంశంలో అయిదు అగ్ర దేశాలు సమాచారాన్ని పంచుకోనున్నాయి. ఆస్టేల్రియా, కెనడా, న్యూజిలాండ్‌, బ్రిటన్‌, అమెరికా దేశాల కూటమితో ఇప్పడు ఫ్రాన్స్‌ జత కట్టనుంది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడీ ఆరు దేశాలు పంచుకోనున్నాయి.