సిలిండర్‌ పేలుడుతో ఉలిక్కిపడ్డ గ్రామం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం

ప్రమాదంపై అనుమానాలు..దర్యాప్తు చేపట్టిన పోలీసులు

వరంగల్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దామెర మండలం కంఠాత్మకూరులో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతులను మామిండ్ల కుమారస్వామి(45), రాజమ్మ(60), సుజాత(35) గా గుర్తించారు. వీరిని తగులబెట్టారని, కాదాకాదు..సింలిండర్‌ పేలి మరణించిందని మరికొందరు చెబుతున్నారు. గ్రామానికి చెందిన మామిండ్ల కుమారస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యతో గొడవలు రావడంతో కుమారస్వామి ఇటీవల పూర్తిగా రెండో భార్యతోనే కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మొదటి భార్య కుమారుడు కార్తీక్‌ ఆదివారం అర్థరాత్రి కొందరు స్నేహితులతో కలిసి కుమారస్వామి ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టడంతోనే కుమారస్వామి, రెండో భార్య సుజాత, అతడి తల్లి రాజమ్మ సజీవదహనమయ్యరని స్థానికులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ ప్రమాదంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంఘటనా స్థలాన్ని డీసీపీ వెంకటేశ్వర్లు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి.. దహన సంస్కారాలకు రూ.10వేల ఆర్థికసాయం అందించారు. ఈ ఘటనపై తలెత్తుతున్న అనుమానాలపై దృష్టి సారించి నిజానిజాలను వెలికి తీయాలని పోలీసులను కోరారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మామిడి లింగయ్యను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో అర్థరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.