సీఎంతో సబిత భేటీ
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో హోంశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం భేటీ అయ్యారు. క్యాంపు కార్యాలయంలో సీఎంతో ఆమె సుమారు రెండుగంటలపాటు సమావేశమయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గనులశాఖ మంత్రిగా పని చేసినప్పుడు జారీ అయిన జీవోలు, తీసుకున్న నిర్ణయాలు, సీబీఐ విచారణ తదితర అంశాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న మంత్రులను సీబీఐ అధికారులు పిలిపించి విచారణ జరుపుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. నోటీసు అందుకున్న ఆరుగురు మంత్రుల్లో ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ అరెస్ట్ కాగా, తాజాగా మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య గురువారం సీబీఐ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మిగిలిన మంత్రులు సబితతోపాటు ధర్మాన ప్రసాద్‌రావు, గీతారెడ్డి, కన్నా లక్ష్మినారాయణలను కూడా సీబీఐ విచారించే అవకాశాలు ఉన్నాయి.