సీఎంని మార్చేది లేదు
తెలంగాణ అంశం కేంద్రం పరిశీలిస్తున్నది
ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి
న్యూఢిల్లీ, నవంబర్ 8 (జనంసాక్షి): రాష్ట్రంలో నాయకత్వ మార్పులపై వస్తున్న ఊహాగానాలను ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి కొట్టిపారేశారు. ఈ ఊహాగానాలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని ఆయన అన్నారు. గురువారం ఏపీ భవన్కు వచ్చిన కృష్ణమూర్తిని కలిసిన మీడియా ప్రతినిధులకుఈ విషయం చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార ్రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పూర్తి కాలం తమ పదవులలో కొనసాగుతారని చెప్పారు. పీసీసీ చీఫ్ మార్పు కూడా ఉండబోదన్నారు. నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలన్నీ మీడియా సృష్టేనని ఆయన అన్నారు. ఈ ఊహాగానాలపై తాను స్పందించా ల్సిన అవసరం లేదని, స్పందించబోమని అన్నారు వారిరువురూ నిర్ణీత కాలవ్యవధి కోసం నియమితులయ్యారని, వారు పూర్తి కాలం కొనసాగుతారని కృష్ణమూర్తి స్పష్టం చేశారు. తెలంగాణ అంశంపై అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని
అన్నారు. ఈ అంశం కేంద్రం, అధిష్టానం పరిధిలో ఉందని చెప్పారు. దీనిపై తానేమీ మాట్లాడబోనని అన్నారు. శుక్రవారం నాడు సూరజ్కుంద్లో జరిగే మేధోమథన సదస్సులో అన్ని రాష్ట్రాలకు సంబంధించి తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారని చెప్పారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పై కూడా ముఖ్యంగా తెలంగాణ అంశంపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదన్నారు.