సీఎం కేసీఆర్ లేఖ‌ను క‌మిష‌న్‌కు అందించాను

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ): జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై లా కమిషన్ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎంపీ వినోద్ కుమార్ లా కమిషన్‌ను కలిసి టీఆర్‌ఎస్ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. జ‌మిలి ఎన్నిక‌ల‌పై సీఎం కేసీఆర్ లేఖ‌ను లా క‌మిష‌న్‌కు అందించాను. 2019 నుంచి జమిలి ఎన్నికలకు టీఆర్‌ఎస్ అనుకూలం. జమిలి ఎన్నికలంటే అన్ని రాష్ర్టాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. జమిలి ఎన్నికలపై చర్చ ఇప్పటికిప్పుడే మొదలైంది కాదు. జమిలి ఎన్నికలపై 1983 నుంచి జాతీయ న్యాయ కమిషన్ చర్చిస్తోంది. మోదీ ప్రభుత్వమో, బీజేపీ ఈ చర్చను ప్రారంభించలేదు. జమిలి ఎన్నికలంటే ప్రధాని నరేంద్రమోదీ తెచ్చిన కొత్త విధానం అనుకుంటున్నారు. మోదీ కంటే ముందు నుంచే ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఈ విధానంతో ఐదేళ్లపాటు కేంద్ర, రాష్ర్టాల పాలన సుగమంగా సాగుతుందన్నారు. పూర్తికాలం పాటు ప్రభుత్వాలు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగానే రాష్ర్టాల్లో జరిగే ఎన్నికలపైనే దృష్టి ఉంటుంది. మోదీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. దీంతో చాలా డబ్బు, సమయం వృథా అవుతుంది. 2019లోనే తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలతో నష్టం ఉండదు. ముందస్తు ఎన్నికలపై చర్చ అని కొందరు అర్థంలేని వాదనకు తెరలేపారు. ఒకేసారి దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతుంది. జిమిలి ఎన్నికల నిర్వహణ ప్రయోజనాలను కమిషన్‌కు వివరించామని పేర్కొన్నారు