సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ హరీశ్‌

నీ పార్టీ మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉంటే తీర్మానం ఎందుకు వీగుతది ?
తెలంగాణ తీర్మానం చేసే వరకూ అసెంబ్లీని సాగనివ్వం
హరీశ్‌ స్పష్టీకరణ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18(జనంసాక్షి): ‘తెలంగాణపై తీర్మానం పెడితే వీగిపోతుందన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణపై తీర్మానం వీగిపో తుందని ఆయన ఎలా చెప్పలగరని నిలదీశారు. పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలకు కట్టుబడి ఉంటే.. తీర్మానం ఎందుకు వీగిపో తుందని ప్రశ్నించారు. తీర్మానం వీగిపోతే, ప్రజలే ఆయా పార్టీలకు బుద్ధిచెబుతారన్నారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం హరీశ్‌రావు విూడియా పాయింట్‌లో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్ర బాబు ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. సభలో సీఎం తీర్మానం పెట్టడు, తీర్మానం అడగాల్సిన చంద్రబాబు అడగడని హరీశ్‌రావు దుయ్యబట్టారు. అసలు తెలంగాణ తీర్మానం ప్రవేశపెడితో
ఎవరి రంగు ఏమిటో బయటపడుతుందన్నారు. తీర్మానం ప్రవేశపెట్టి విప్‌ జారీ చేస్తే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ధిక్కరిస్తారా? టీడీపీ అధినేత తెలంగాణకు మద్దతుగా లేఖ ఇస్తే.. ఆ పార్టీ సభ్యులు కాదం టారా? తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశిస్తే.. సీఎం కిరణ్‌ వాళ్ల పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తారా? డిసెంబర్‌ తొమ్మిది నాటి ప్రకటనను ధిక్కరిస్తారా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే తీర్మానం ప్రవేశపెట్టి, ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ తీర్మానం వీగిపోతే ప్రజలు చావగొడ తారని హెచ్చరించారు. సమైక్య పాలనలో సీఎంలు మారినా.. తెలంగాణ ప్రజల బతుకులు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీర్మానం నెగ్గకుండా టీడీపీ, కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయని విమర్శించారు.
తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌పై ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఉద్యమ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. కేసులు, అరెస్టులు తమకు కొత్త కాదని, ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ సాధించుకునే వరకు వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. గతంలో ఎన్నో కేసులు చూశామని, ఎన్నోసార్లు అరెస్టు అయ్యామని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న ఉద్యమకారులకు కేసులు, అరెస్టులంటే భయం లేదన్నారు. తెలంగాణ మార్చ్‌కు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతిస్తుందని హరీశ్‌రావు ప్రకటించారు. మార్చ్‌లో పాల్గొంటామని స్పష్టం చేశారు. మార్చ్‌ను దిగ్విజయవంతం చేస్తామన్నారు.
అసెంబ్లీలో తెలంగాణ అంశంపై చర్చను ఎవరైనా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే.. అడ్డుకుంటామని హరీశ్‌రావు హెచ్చరించారు. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ్‌ సభలో తెలంగాణపై జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడారని, అందుకు అభ్యంతరం చెబుతూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నామని చెప్పారు. జేపీ ప్రసంగం తర్వాత తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినా స్పీకర్‌ పట్టించుకోలేదని వాపోయారు. 80 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల గురించి మాట్లాడుతున్న జేపీ.. 900 మంది
తెలంగాణ యువకులు ఆత్మబలిదానాలకు పాల్పడినప్పుడు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, వాటిపై చర్చిద్దామని టీడీపీ వాదిస్తోందని.. తెలంగాణ అంశం ప్రజా సమస్య కాదా? అని ఆయన నిలదీశారు. నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్ష అయిన తెలంగాణ ప్రజల సమస్య కాదా? దానిపై ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. తమకు తెలంగాణెళి ప్రధాన సమస్య అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. తెలంగాణపై తీర్మానం కోసం గురువారం కూడా అసెంబ్లీలోపట్టుబడతామని స్పష్టం చేశారు.