సీడ్ యాక్సెస్ రహదారి పనులను అడ్డుకున్న రైతులు
– పరిహారం ప్రకటించి సర్వే నిర్వహించాలని డిమాండ్
– రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అమరావతి, మే25(జనంసాక్షి) : గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించే సీడ్ యాక్సెస్ రహదారి సర్వే పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. అమరావతిలో నిర్మించే సీడ్ యాక్సిస్ రహదారిని తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారితో అనుసంధానించేందుకు దాదాపు 28 ఎకరాలు అవసరమని జిల్లా యంత్రాంగం గుర్తించింది. తాడేపల్లి పట్టణంలోని మహానాడు నుంచి సీడ్ యాక్సిస్ రహదారిని అనుసంధానించే ప్రాంతం వరకు 27.74 ఎకరాల భూమిని సవిూకరించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి స్థానికులు రైతులు అభ్యంతరం తెలిపారు. తమ భూములను ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో అధికారులు భూసేకరణ ద్వారా సేకరించాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. భూమిని తీసుకునేందుకు భూసేకరణ చట్టం ప్రకారంలో భాగంగా సర్వే చేసి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. శుక్రవారం సర్వేకు వచ్చిన అధికారులను రైతులు, స్థానికులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సర్వేకు అడ్డుతగులుతున్న రైతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముందుగా పరిహారం వెల్లడించిన తర్వాతే భూములిస్తామని స్థానికులు చెబుతున్నారు. ఎవరికెంత భూమి ఉందో తెలియకుండా పరిహారం నిర్ణయించలేమని అది గుర్తించేందుకే సర్వే చేస్తున్నామని తహసీల్దార్ పద్మనాభుడు చెప్పారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమ ంగా తమ భూములను లాక్కొంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం తెలపకుండా భూములు ఇవ్వాలంటే ఎలా ఇస్తామని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వం రైతుల భూములను లాక్కొని తమను రోడ్డుపాలు చేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మా భూములు ఇచ్చేది లేదని పేర్కొన్నారు.