సీబీఐ ఎదుట హాజరైన చిదంబరం

 ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో ప్రశ్నించిన అధికారులు

న్యూఢిల్లీ, జూన్‌6(జ‌నం సాక్షి) : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం బుధవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో ప్రశ్నించేందుకు సీబీఐ ఆయనను విచారణకు పిలిచింది. విచారణ కోసం చిదంబరం బుధవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధానకార్యాలయానికి వచ్చారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ విూడియాలో విదేశీ పెట్టుబడులకు ఇచ్చిన అనుమతులలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కేసులో చిదంరం కుమారుడు కార్తి చిదంబరం, ఐఎన్‌ఎక్స్‌ విూడియా మాజీ అధినేతలు పీటర్‌ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ఎన్‌ఎక్స్‌ విూడియాకు సంబంధించిన విదేశీ పెట్టుబడుల ప్రమోషన్‌ బోర్డు (ఎఫ్‌ఐపీబీ)కి అనుమతి ఇవ్వడంలో చిదంబరం పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గత ఏడాది మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ కార్తి చిదంబరంను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి చిదంబరాన్ని జులై 3 వరకు అరెస్ట్‌ చేయొద్దని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులోనూ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కూడా ఆయనను జులై 10 వరకు అరెస్ట్‌ చేయొద్దని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ రెండు కేసుల్లోనూ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చిదంబరం విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.