సుదిర్మన్ కప్ నుంచి సైనా ఔట్
గాయంతో తప్పుకున్న హైదరాబాదీ షట్లర్
హైదరాబాద్ ,మే 16:
ప్రతిష్టాత్మకమైన సుదిర్మన్ కప్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ షట్లర్ సైనానెహ్వాల్ ఈ టోర్నీకి దూరమైంది. ఇండియన్ ఓపెన్ సమయంలో తగిలిన గాయం పూర్తిగా తగ్గకపోవడంతో సుదిర్మన్‌కప్ నుండి తప్పుకుంటున్నట్టు సైనా తెలిపింది. కఠిన నిర్ణయమే అయినప్పటకీ తప్పలేదని వెల్లడించింది. తాను లేకున్నా మిగిలిన జట్టంతా బాగా ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. సుదిర్మన్ కప్ నుండి తప్పుకోవడం ద్వారా తర్వాత జరిగే మూడు మేజర్ టోర్నీలు థాయ్‌లాండ్ గ్రాండ్ ప్రీ , ఇండోనేషియా ప్రీమియర్ సూపర్ సిరీస్ , సింగపూర్ సూపర్ సిరీస్‌లకు అందుబాటులో ఉంటానని సైనా వెల్లడించింది. సుదిర్మన్ కప్‌లో ఆడకపోవడంతో సైనా ఐదు వేల ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. తద్వారా ఆమె ర్యాంకింగ్‌లో కూడా మార్పు జరిగే ఛాన్సుంది. కాగా సైనా తప్పుకోవడంతో ఇక మహిళల సింగిల్స్‌లో ఆశలన్నీ పివి సింధుపైనే ఉన్నాయి. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తూ భవిష్యత్ సైనాగా పిలవబడుతోన్న తెలుగుతేజం సింధు ఇటీవలే మలేషియన్ గ్రాండ్ ప్రీ గెలిచి ఫామ్‌లో ఉంది. అయితే సుదిర్మన్ కప్‌లో ఎదురయ్యే గట్టిపోటీని ఆమె ఎంతవరకూ తట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అటు గాయం విషయంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదన్న ఉధ్దేశంతోనే సైనా తప్పుకున్నట్టు కోచ్ పుల్లెల గోపీచంద్ చెప్పాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జట్టుతోనే మంచి ఫలితాలు రాబడతామని తెలిపాడు. సుదిర్మన్‌కప్‌లో భారత్ , చైనా , ఇండోనేషియాలతో ఆడాల్సి ఉండగా… వీరిలో ఒకరినైనా ఓడిస్తేనే ముందంజ వేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టోర్నీ భారత షట్లర్లకు కఠిన పరీక్షగానే చెప్పొచ్చు.