సునీల్‌ దత్‌ రియల్‌ లీడర్‌

ఆయన జయంతి సందర్భంగా జ్ఞాపకాలు నెమరేసుకున్న ఖుష్బూ

చెన్నై,జూన్‌6(జ‌నం సాక్షి): దివంగత సునీల్‌ దత్‌ కారణంగానే తాను కాంగ్రెస్‌లో ఉన్నానంటూ ప్రముఖ నటి, కాంగ్రెస్‌ పార్టీ నేత ఖుష్బూ ప్రకటించారు. దివంగత నటుడు, సంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌ దత్‌ను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తాను కాంగ్రెస్‌లో చేరడానికి ఆయనే కారణమని అన్నారు. సునీల్‌ దత్‌ జయంతి సందర్భంగా ఖుష్బూ ట్విటర్‌ ద్వారా సునీల్‌ దత్‌కు నివాళులు అర్పించారు. తనకు సునీల్‌ దత్‌తో ఉన్న అనుబంధం గురించి వెల్లడించారు. ‘సునీల్‌ దత్‌ అంకుల్‌ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకుంటున్నాను. ఉత్తరాది ప్రజలు నన్ను ఇప్పటికీ ‘బేబీ ఖుష్బూ’గానే గుర్తుపడతారు. సునీల్‌ అంకుల్‌ నటించిన ‘దర్ద్‌ కా రిష్తా’ చిత్రంలో నాది చిన్నారి పాత్ర. ఆ సినిమాలోని పాత్రే నాకు ఇంత గుర్తింపునిచ్చింది. వీటన్నింటికి మించి ఆయన ఆఫీస్‌లో నేను గడిపిన రోజులు నాకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. నా జీవితంలో సునీల్‌ అంకుల్‌ లాంటి మంచి వ్యక్తిని నేనెప్పుడూ కలవలేదు. చిన్నప్పుడు ఆయన ఆఫీస్‌కి వెళ్లి టేబుల్‌ కింద కూర్చుని ఆయనతో పాటు బొమ్మలు వేస్తూ ఉండేదాన్ని. ఆయన నా బొమ్మలు చూసి ‘నువ్వు గొప్ప ఆర్టిస్ట్‌వి’ అనేవారు. ఆయన్ని చాలా మిస్సవుతున్నాను. నేను కాంగ్రెస్‌లో ఉండటానికి సునీల్‌ అంకులే కారణం. రాజకీయ నాయకుడు అంటే ప్రజా సేవకుడు అన్న నినాదాన్ని నమ్మిన ఏకైక వ్యక్తి సునీల్‌ దత్‌. ప్రజల నుంచి ఏవిూ ఆశించకుండా వారికి ఎంతో సేవ చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచారు. సునీల్‌ దత్‌ లాంటి మరెందరో నేతల అవసరం మనకుంది. విూరు ఉండుంటే బాగుండేది సునీల్‌ అంకుల్‌’ అని పేర్కొన్నారు ఖుష్బూ. నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా సునీల్‌ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాంలో సునీల్‌2004 నుంచి 2005 వరకు యూత్‌ ఎఫైర్స్‌, క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. 1968లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2005లో సునీల్‌ ముంబయిలోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. ఇప్పుడు ఆయన కుమారుడు సంజయ్‌ దత్‌ జీవితాధారంగా సినిమారాబోతోంది. ఇందులో సునీల్‌ పాత్రలో పరేశ్‌ రావల్‌, సంజయ్‌ పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్నారు.