సూటు బూటు విదేశీ పర్యటన
– రాహుల్
బెంగళూరు నవంబర్ 25 (జనంసాక్షి):ఈ సూట్, బూట్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని ధ్వజమెత్తారు. దేశంలో పెరిగిపోతోన్న అసహన వైఖరి ఇబ్బందిగా పరిణమించిందని , ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు. బుధవారం ఆయన బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రధాని విదేశీ యాత్రలకు పరిమితమయ్యారని, దేశాన్ని పీఎంవో నడిపిస్తోందని విమర్శించారు. కేవలం ఒక్క వ్యక్తి దగ్గరే నిర్ణయాధికారం ఉండటం సరైంది కాదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అభిప్రాయపడ్డారు. కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే భారత్ ను నడిపించాలనుకుంటున్నారని మోడీ ఒంటెద్దు పోకడపై పరోక్షంగా విమర్శలు సంధించారు. మోడీ సర్కారు కేవలం ఐదారుగురు పారిశ్రామిక వేత్తల కోసం పని చేస్తోందని రాహుల్ విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్నికల ముందు హావిూలు ఇచ్చిన మోడీ?. ఏడుగురు బిజినెస్ మ్యాన్ల కోసం పని చేస్తున్నారని అన్నారు. దేశంలో పెరిగిపోతున్న అసహనం తనను ఎంతో బాధించిందన్నారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం తమ ఎజెండా కాదని, కానీ జీఎస్టీ బిల్లుపై కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు. దాన్ని మరింత సులభతరం చేయాలని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జీఎస్టీ బిల్లుపై దుమారం తప్పదని పరోక్షంగా హింట్ ఇచ్చారు. మరోవైపు, మేకిన్ ఇండియా, స్వచ్ఛభారత్ లపై విద్యార్ధులను ప్రశ్నించి రాహుల్ భంగపడ్డారు. మేకిన్ ఇండియా, స్వచ్ఛ భారత్ సమర్ధవంతంగా అమలవుతున్నాయా? అని విద్యార్థులను రాహుల్ ప్రశ్నించారు. దానికి వారు అవునని సమాధానమిచ్చారు. దాంతో షాక్ తిన్న రాహుల్ ? స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా అమలవుతున్నట్లు తనకైతే అనిపించడం లేదని కవర్ చేసుకున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు అనుకూలంగా సమాధానం రాకపోవడంతో టాపిక్ డైవర్ట్ చేశారు. స్వచ్ఛ భారత్ అమలు గురించి కొందరు అవునని, మరికొందరు కాదని సమాధానమివ్వగా?మేకిన్ ఇండియా గురించి ఎక్కువ మంది అవునని సమాధానమిచ్చారు.