సూరజ్‌కుండ్‌లో కాంగ్రెస్ మేధోమథనం
ఢిల్లీ : కాంగ్రెస్ మేధోమథనం సదస్సు ఢిల్లీకి సమీపంలోని సూరజ్‌కుండ్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్టీ శాశ్వత ఆహ్వానితులు, కేబినెట్ మంత్రులతో సహా మొత్తం 75 మంది అగ్రనేతలు పాల్గొంటున్నారు. 2014 ఎన్నికలకు ప్రణాళికా రచన, ఏఐసీసీ ప్రక్షాళన, పార్టీ, ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు, కనీస ఉమ్మడి కార్యక్రమం అమలు, ఎన్నికల మేనిఫెస్టో తదితర అంశాలను సదస్సులో చర్చించనున్నారు. ఆరుగంటల పాటు ఈ సదస్సు సాగుతుంది. సాయంత్రం ఏడు గంటలకు సదస్సు విశేషాలను మీడియా సమావేశంలో వివరిస్తారు. ఒక నిర్దిష్ట ఎజెండా ఏదీ లేదని, ఎవరైనా ఏ విషయంలోనైనా చర్చించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి జైపాల్‌రెడ్డి, పల్లంరాజు, చిరంజీవి ఈ సదస్సుకు హాజరుకానున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీతో సహా నేతలందరూ తమ విలాసవంతమైన కార్లలో కాక పార్టీ ఏర్పాటు చేసిన ఏసీ బస్సుల్లోనే సదస్సు స్థలికి రావడం విశేషం.