సూర్యాపేటకు చేరుకున్న సీఎం కేసీఆర్‌

4
– నేడు అమరావతికి ముఖ్యమంత్రి

హైదరాబాద్‌,అక్టోబర్‌21(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట కు చేరుకున్నారు. పట్టణానికి వచ్చిన సీఎంకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. సీఎం ఇవాళ రాత్రి మంత్రి జగదీష్‌రెడ్డి ఇంట్లో బసచేయనున్నారు. రేపు ఉదయం హెలికాప్టర్‌ ద్వారా అమరావతి కి చేరుకుని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం అమరావతి నుంచి సూర్యాపేటకు చేరుకుని ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.  గురువారం అమరావతి శంకుస్తాపనకు కెసిఆర్‌ బయలుదేరి వెళతారు. హెలికాప్టర్‌ ద్వారా ఆయన వెళతారు. గురువారం సిఎం నల్గొండ, మెదక్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10.15గంటలకు నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి కేసీఆర్‌ హెలిక్టాపర్‌లో అమరావతి బయలుదేరనున్నారు.  10.45 గంటలకు అమరావతి చేరుకుంటారు. మధ్యాహ్నం 2గంటల వరకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.  మధ్యాహ్నం 2.30గంటలకు అమరావతి నుంచి సూర్యాపేట చేరుకుంటారు. సూర్యాపేట గొల్లబజార్‌లో 2 పడకగదుల ఇళ్లకు శంకుస్థాపన చేస్తారు.  సాయంత్రం 4.30 గంటలకు హెలిక్టాపర్‌లో దత్తతగ్రామం ఎర్రవల్లి చేరుకుని దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఎర్రవల్లిలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.  సాయంత్రం 6.10 గంటలకు మరో దత్తత గ్రామం నరసన్నపేటలో పర్యటిస్తారు. నరసన్నపేటలో 2 పడకగదుల ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం  రాత్రి ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో సీఎం కేసీఆర్‌ బస చేయనున్నారు. ఇదిలావుంటే రాజధాని ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ విజయవాడలో భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు వెలిశాయి. ఏకంగా ప్రధాన ద్వారాలకే కేసీఆర్‌ ఫొటోలతో కట్టిన ఫ్లెక్సీలు పలువురిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రోడ్లపై వెళ్లే వాహనదారులు ప్రత్యేకంగా ఆగి చూడటం లాంటి అంశాలతో సీఎం కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీగా అభిమానులున్నారనే అంశం స్పష్టమైంది. రాజధాని ప్రాంతంలో సీఎం కేసీఆర్‌ పర్యటనకు అనూహ్య ఆహ్వనం లభిస్తున్నది. విజయవాడ కార్పొరేషన్‌ స్వాగత ద్వారంపై తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావుకు అపూర్వ స్వాగతం అంటూ కాట్రగడ్డ బాబు పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆకర్షిస్తున్నది. విజయవాడ పట్టణంలో నగర పాలక సంస్థ ద్వారానికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు స్వాగతం.. సుస్వాగతం అంటూ సాదరంగా ఆహ్వానించే తోరణాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవడానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు స్వాగతం.. సుస్వాగతం అంటూ మరో భారీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక శుభ పరిణామం అని ఇటీవల టీడీపీ చేపట్టిన ఐవీఆర్‌ఎస్‌లో సర్వేలో 96 శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్న ఇరు రాష్ట్రాల సీఎంలు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ఆహ్వాన రూపంలో కలువడంపై హర్షం వ్యక్తమవుతున్నట్లు సర్వేలో తేలింది. ఇద్దరు ముఖ్యమంత్రులు సఖ్యతతో మెలిగి సమస్యలను పరిష్కరించుకోవడమే కాకుండా, అభివృద్ధి పనులకు బాటలు వేయవచ్చని తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ముక్తకంఠంతో చెప్పినట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి.