సెకండ్‌ వేవ్‌పై సీరియస్‌ – మంత్రి ఈటల సమీక్ష

 

హైదరాబాద్‌,డిసెంబరు 24 (జనంసాక్షి): కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్తరకం స్ట్రెయిన్‌పై చర్చించేందుకు బీఆర్‌కే భవన్‌లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, కరోనా సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులతో ఆయన సవిూక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్‌ 9 నుంచి ఇప్పటి వరకు యూకే నుంచి తెలంగాణకు 1200 మంది వచ్చారని, వీరిలో 846 మందిని గుర్తించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. వీరిలో వైరస్‌ రకాన్ని తెలుసుకునేందుకు సీసీఎంబీ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. వీరిని కలిసి వారిని సైతం గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

వేడుకలు ఇంట్లోనే జరుపుకోవాలి..

వాక్సిన్‌ అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రజలకు అందించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వాక్సిన్‌ రవాణా, నిల్వ, పంపిణీ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. వాక్సిన్‌ వేసేందుకు పది వేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మొదటి దశలో 70 నుంచి 80 లక్షల మందికి టీకా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. హెల్త్‌, పోలీస్‌, మున్సిపల్‌, ఫైర్‌ సిబ్బందితోపాటు వృద్ధులకు తొలిదశలో టీకా ఇవ్వనున్నామని చెప్పారు. మొదటి డోసు వేసిన 28 రోజుల తరువాత రెండో డోసు వేయాలి… అందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధంగా చేయాలని అధికారులను ఆదేశించారు. వాక్సిన్‌ సరఫరాకు అవసరమైన కోల్డ్‌చైన్‌, మ్యాపింగ్‌, సిబ్బందికి శిక్షణ, వాక్సిన్‌ పంపిణీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు.

ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలి..

కరోనా లాంటి మహమ్మారులను తట్టుకోవాలంటే ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని అని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. 11 సిటీ స్కాన్‌, 3 ఎంఆర్‌ఐ స్కానింగ్‌ యంత్రాలను కొనుగోలు చేసి వెంటనే అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. బస్తీ దవాఖానాల్లో ఎక్స్‌ రే, ఆల్ట్రా సౌండ్‌ , ఈసీజీ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. డయాలసిస్‌ కేంద్రాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. రోగులు డయాలసిస్‌ కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా చూడాలని సూచించారు.