సెక్షన్ 8 గురించి వాళ్లిద్దరికీ ముందే తెలుసు..
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చాలా కాలం తర్వాత నోరు విప్పారు. చాలా రోజులుగా సైలెంట్‌గా ఉంటున్న పొన్నాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై మండిపడ్డారు. కేసీఆర్, చంద్రబాబులకు సెక్షన్-8 గురించి విభజన సమయంలోనే బాగా తెలుసునని దుయ్యబట్టారు.
ఇంకా ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించిన పొన్నాల.. ఏపీ నేతల ఫోన్లను ట్యాప్ చేయలేదని చెప్పే దమ్ము కానీ, ధైర్యం కానీ కేసీఆర్‌కు ఉందా? అంటూ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుతో ఇద్దరు సీఎంలు పబ్బం గడుపుకునే పనిలో పడ్డారని పొన్నాల విమర్శించారు.
కాగా ఓటుకు నోటు కేసు ఉత్కంఠను రేపుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకు తేవడమే కాకుండా, దానిపై సిట్ కూడా వేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కానీ, ఏసీబీ కానీ ఎలాంటి ట్యాపింగులకు పాల్పడలేదని టీఎస్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు మంత్రులు పదేపదే చెబుతున్నప్పటికీ పొన్నాల మాత్రం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడలేదని కేసీఆర్‌కు చెప్పే ధైర్యం లేదన్నారు.