సెక్స్‌ స్కాండల్‌ నిందితుడు

ప్రజ్వల్‌ రేవణ్ణ ఘోర పరాజయం
బెంగళూరు,జూన్‌4 (జనంసాక్షి): సెక్స్‌ స్కాండల్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తన సొంత నియోజకవర్గం హసన్‌లో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రేయస్‌ ఎం పాటిల్‌ 44,000 ఓట్ల తేడాతో ప్రజ్వల్‌పై గెలుపొందారు. కౌంటింగ్‌ ప్రారంభమైన సమయంలో ప్రజ్వల్‌ ఆధిక్యంలో కొనసాగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెనుకంజలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు 44 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 1.4 లక్షల మెజారిటీతో హసన్‌ నుంచి ప్రజ్వల్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ఈసారి కర్ణాటకలో బీజేపీతో పొత్తుతో జేడీ(ఎస్‌) కర్ణాటకలో పోటీ చేసింది.కాగా, ఇటీవల మహిళలపై లైంగిక దౌర్జన్యం, కిడ్నాప్‌ వంటి ఆరోపణలతో ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రజ్వల్‌కు నిన్న వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రజ్వల్‌ను సిట్‌ అధికారులు అంబులెన్స్‌లో సోమవారం శివాజినగర్‌లోని బౌరింగ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోర్టుకు సమర్పించేందుకు అవసరమైన మూడు, నాలుగు రకాల వైద్యపరీక్షలు చేయాలని వైద్యాధికారులను కోరారు. దీంతో మెడికల్‌ కాలేజీ డీన్‌, సూపరింటెండెంట్‌ సమక్షంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజ్వల్‌ను కస్టడీకి తీసుకుని మూడు రోజులు గడిచింది. ఏ ప్రశ్న అడిగినా తాను తప్పు చేయలేదని, ఇదంతా రాజకీయ కుట్ర అని, తనను రాజకీయంగా వేధిస్తున్నారని చెప్పినట్లు తెలుస్తోంది.