సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా…

ప్రజాస్వామ్యంలో హక్కులే కాదు బాధ్యతలను కూడా  గుర్తెరగాలి:
ప్రాచీన మానవుడు వేట సమయంలో క్రూర మృగాల నుండి   తనకుతాను రక్షించుకోడానికి సమూహాలుగా తిరిగేవాడు. ఈ సమూహంలో ఉన్న మానవులకు దిశా నిర్దేశం చేయడానికి బలవంతుడైన పెద్ద ఉండేవాడు. అప్పట్లో పేరు పెట్టకపోయినా ఆ పెద్దనే నాయకుడని చెప్పొచ్చు. కాల క్రమేణా ఈ ఇటువంటి సమూహాలన్నీ గ్రామాలుగా, ఈ గ్రామాలు అన్నీ కలిసి రాజ్యంగా ఏర్పడ్డాయి. ఇటువంటి రాజ్యాలు ఎన్నో ఒక దాని ప్రక్కన ఇంకొకటి ఏర్పడిన తరువాత ఒక రాజ్యంలోని ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సంపదని ఇంకో రాజ్యంలోని ప్రజలు దోచుకోకుండా ప్రతి రాజ్యానికి ఒక నాయకుడు అవసరమయ్యాడు. ఆ నాయకుడు యొక్క ప్రధమ కర్తవ్యం ఆ రాజ్యములోని ప్రజలను రక్షించడం. అయితే రాను రాను ఈ నాయకుడి యొక్క  బాధ్యతలు ఎక్కువయ్యాయి. అప్పట్లో ఎవరు బలవంతుడైతే వాడే నాయకుడిగా చలామణయ్యేవాడు. అలా ఆ నాయకుడు నిరంకుశత్వంగా తయారయ్యాడు. వాడే రాచరిక వ్యవస్థలో రాజుగా మారాడు. రాచరికంలో రాజు దైవాంశ సంభూతుడుగా ప్రవర్తించేవాడు. వాడు చెప్పిందే వేదం. వాడి మాట వినని వారికి మరణమే శరణ్యం. వారి కుటుంబానికి సంబంధించిన వాడే వారసత్వంగా రాజు అయ్యేవాడు. ప్రజలకు స్వేచ్చ, స్వాతంత్ర్యాలు లేవు. కానీ రాజుని ఎదురించే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు.అటువంటి కాలంలో ప్రజాస్వామ్యం భావన మొట్టమొదటి సారిగా 508 బి.సి లో పురాతన ఏథెన్స్ లో ఉద్భవించిందని చరిత్రకారులు చెప్తారు.అరిస్టాటిల్ ప్రకారం, ప్రజాస్వామ్యం యొక్క అంతర్గత నియమం స్వేచ్ఛ. కేవలం ప్రజాస్వామ్యం వలనె పౌరులు స్వేచ్ఛను పోందుతారు. స్వేచ్ఛ కొరకే ప్రజాస్వామ్యం ఉన్నదని చెప్పారు. ప్రజాస్వామ్యం  అనే పదం గ్రీకు పదాలు డెమోస్(ప్రజలు)  మరియు క్రాటోస్ (పాలన) నుండి ఉద్భవించింది. ముఖ్యంగా ప్రజల పాలన అని అర్థం. ఇది ప్రభుత్వ వ్యవస్థ, ఇక్కడ పౌరులు నేరుగా అధికారాన్ని వినియోగించుకుంటారు లేదా పాలకమండలిని ఏర్పాటు చేయడానికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రభుత్వం పౌరులకు జవాబుదారీగా ఉండే వ్యవస్థగా ప్రజాస్వామ్యం నిలుస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో, పౌరులు తమ తరపున చట్టాలు మరియు విధానాలను రూపొందించడానికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. రాజ్యాంగ ప్రజాస్వామ్యం అనేది రాజ్యాంగం ద్వారా నియంత్రించబడే ప్రజాస్వామ్య ప్రభుత్వం. మానిటరీ ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యం యొక్క ఆధునిక రూపం. ఇక్కడ వివిధ రకాలైన వాచ్‌డాగ్ బాడీలు మరియు ఏజెన్సీలు అధికార సాధనను పర్యవేక్షిస్తాయి మరియు ప్రభావితం చేస్తాయి. ఈ మానిటర్లు ప్రభుత్వేతర సంస్థలు, స్వతంత్ర మీడియా, పబ్లిక్ ఇంటెగ్రిటీ కమిషన్‌లు మరియు ఎన్నికైన ప్రతినిధుల చర్యలపై నిఘా ఉంచే అనేక ఇతర సంస్థలు కావచ్చు. ఐతే ఆధునిక యుగంలో ప్రజాస్వామ్యం కలిగిన దేశాలు చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్యం యొక్క మౌలిక భావనగా  ప్రజలే తమ నాయకుడిని ఎంచుకునే లేదా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని దేశాలలో పౌరులు తమ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రిని పరోక్షంగానూ, కొన్ని దేశాలలో ప్రత్యక్షంగానూ తమ ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యం అనే వాహనానికి ప్రజలే ఇంధనం. నాయకుడే సారథి. ఇది చక్కగా నడవాలంటే ప్రధానమైన చక్రాలుగా న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థలుగా చెప్పుకోవచ్చు. ఈ వాహనం సాఫీగా ప్రయాణం చేయాలంటే అన్నీ వ్యవస్థలు చక్కగా పని చేయాలి.
హక్కులే కాదు…బాధ్యతల్ని గుర్తెరగాలి:
ప్రజాస్వామ్యంలో ప్రజలు హక్కులు కోసం పోరాడే ముందు వారు తమ తమ బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నామో ఆలోచన చేయాలి. హక్కులు బాధ్యతలు ఒకే నాణేనికి బొమ్మ బొరుసు వంటివి. ప్రాథమిక బాధ్యతలు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రధానమైనవి. ఈ దేశం నాకేం ఇచ్చింది అనేది కాదు నేను ఈ దేశానికి ఏమి చేశానని ప్రశ్నించుకోవాలి. మన బాధ్యతలను మనం తెలుసుకుంటే  మొత్తం సామాజిక వ్యవస్థలో ఉన్న లోపాలని మార్చగల శక్తి మనకు వస్తుంది. మన బాధ్యతను తెలుసుకోవడం అంటే మనల్ని మనం సంస్కరించుకోవటమే. మొదటి బాధ్యతగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరూ  ఓటరుగా నమోదు అవ్వాలి. వీరందరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం యొక్క తొలి అంకం ప్రారంభం అవుతుంది. కుల,మత,వర్గాలకు అతీతంగా ప్రజలకు మేలు చేసే నాయకుడికి ఓటు వెయ్యాలి. తమ కులం వాడనో, తమ మతం వాడనో, తమ వర్గం వాడనో ఓటు వేయడం చేస్తే ప్రజలు ప్రజాస్వామ్యం ఫలాల కోసం ప్రశ్నించే హక్కును కోల్పోయినట్లే. ఎన్నికలలో పోటీ చేసే వారి నుండి ఏటువంటి తాయిలాలను యే రూపంలో కూడా ఆశించకూడదు.
మన దేశంలో…..
అంబేడ్కర్‌ గారి మాటల్లో ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాల్లో విప్లవాత్మక మార్పులను ఏ రక్తపాతమూ లేకుండా తెచ్చే ప్రభుత్వరూపమే ప్రజాస్వామ్యం. భారత ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలు భారతదేశం యొక్క విభిన్న సామాజిక-సాంస్కృతిక దృశ్యాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య సూత్రాలకు దాని నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.  భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని అనుసరించడం ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇక్కడ అధికారం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించబడింది.18 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు ఉంది, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుంది. ప్రతీ పౌరుడు తప్పనిసరిగా కొన్ని బాధ్యతలను తెలుసుకోవాలి. ప్రతీ పౌరుడు భారత రాజ్యాంగానికి బద్ధులై ఉండాలి. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని, రాజ్యాంగ ఆశయాలను, రాజ్యాంగ సంస్థలను గౌరవించాలి. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత ఆశయాలను అనుసరించాలి. భారతదేశము యొక్క సార్వభౌమాధికారాన్ని సమైక్యతను గౌరవించాలి. దేశాన్ని సంరక్షించుకోవడం కోసం అవసరం ఏర్పడినప్పుడు ప్రభుత్వానికి సేవలు అందించాలి. మత, ప్రాంతీయ, వేర్పాటువాద, భాషాపరమైన సంకుచిత భావాలకు అతీతముగా సోదర భావాన్ని స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించాలి. స్త్రీల యొక్క గౌరవాన్ని కించపరిచే పద్ధతులు చర్యలను నిరసించాలి. విభిన్న సంస్కృతుల సమ్మిళితమైన మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించాలి. అడవులు, సరస్సులు, నదులు, వణ్య మృగాలతో సహా మన జాతీయ పర్యావరణాన్ని సంరక్షించటము సమస్త జీవుల యడల ప్రేమానురాగాలను కలిగి ఉండాలి. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతా వాదాన్ని, జిజ్ఞాసను సంస్కరణ వాదాన్ని పెంపొందించుకోవాలి. హింసా వాదాన్ని వ్యతిరేకించాలి. ప్రభుత్వం ఆస్తులను సంరక్షించాలి. వ్యక్తిగతముగాను, సమిష్టి కృషి ద్వారాను ఉన్నత శిఖరాన్ని అదిరోహించటం ద్వారా దేశ ఔన్నత్యాన్ని పెంపొందించాలి.
డి జె మోహన రావు
ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా
ఆంధ్రప్రదేశ్
8247045230