సేంద్రియ సాగు కింద నవధాన్యాలకు ప్రోత్సాహం
జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రచారం
సాగుకు ముందుకు వచ్చే రైతులకు సన్మానం
చిత్తూరు,జూన్9(జనం సాక్షి ): ఈ యేడాది కూడా నవధాన్యాల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రోత్సాహాన్ని ఇస్తోంది. రైతులకు ఈ మేరకు చైతన్యం కలిగిస్తున్నారు. సేంద్రియ సాగు ప్రోత్సాహకంలో భాగంగా ఖరీఫ్ సీజన్‌లో నవ ధాన్యాల సాగు విస్తరణకు రైతులను ప్రోత్సహింస్తున్నామని జిల్లా పథక మేనేజరు జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. సేంద్రియ సాగుకు మంచి భవిష్యత్ ఉందని.. పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ సాగు విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తోందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం పథకం అమలు చేస్తున్న 19 క్లస్టర్లు పరిధిలోని 95 గ్రామాల్లో ఖరీఫ్ నందు వేరుసెనగ సాగుతో పాటు నవ ధాన్యాలు కంది, జొన్న, అలసంద, అనప సాగును విస్తరించాలన్నారు. ప్రతి రైతును నవధాన్యాల సాగు చేపట్టే దిశగా ప్రోత్సహించాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం, నవ ధాన్యాల సాగు విస్తరణకు శనివారం నుంచి వారం రోజుల పాటు గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సేంద్రియ పద్ధతిలో పంటల సాగుతో ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకం, నవ ధాన్యాల సాగుతో కలిగే లాభాలు తదితర అంశాలను రైతులకు వివరించి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రామానికి ఐదుగురు చొప్పున సేంద్రియ సాగు రైతులను ఎంపిక చేసి సన్మానించనున్నట్లు చెప్పారు.అనంతరం క్లస్టర్ల వారీగా లక్ష్యాలు, ప్రగతిపై సవిూక్షించారు.