సేంద్రియ సాగు దిశగా కూరగాయ రైతులు

సిద్దిపేట,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించేలా రైతులు తమ విదానాలు మార్చుకున్నారు. నాబార్డు సౌజన్యంతో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సంగారెడ్డి జిల్లాలోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్‌ ముందుకు వచ్చింది. ఇప్పటికే బిగ్‌ బకెట్‌, ఇస్కాన్‌, ఐఐపీసీ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. 500 మంది రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు చేసే కూరగాయలు, ఆకుకూరలను సేకరణ కేంద్రం ద్వారా ఈ సంస్థలకు పంపుతారు. దీన్ని ఉత్పత్తిదారుల సంఘం పర్యవేక్షిస్తుంది. ఫలితంగా రైతులకు దళారుల బెడద తప్పి గిట్టుబాటు ధర వస్తుంది. గతేడాది చేపట్టిన ఈ పథకంతో ఇప్పటికే రైతులు అబ్ది పొందుతున్నారు. నేరుగా కొందరు సహకారం తీసుకుని లబ్ది పొందుతున్నారు. కూరగాయలు పండించడంలో ఈ ప్రాంత రైతులు గతంలో కన్నా మెరుగైన పద్దతులు అవలంబిస్తున్నారు. మేలి రకం వంగడాలు, యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడి సాధించడంపై రైతులకు ఇక్రిశాట్‌ అవగాహన కలిగించనుంది. సేంద్రియ ఎరువులతో కూరగాయల పంటలను పోత్స్ర్రహించేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇందుకు ఉద్యాన శాఖ కూడా సహకారం అందిస్తోంది. సిద్దిపేట మండలంలో కూరగాయలు పండించే రైతులకు ముందుగా ఈ సహకారం ఇవ్వనున్నారు. నిర్దేశించిన సంస్థలకు మేలిరకం కూరగాయలు, ఆకుకూరలు అందుతాయి. ఫలితంగా అన్నదాతలకు మేలు జరుగుతుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇక్రిశాట్‌ సంస్థ కూరగాయలు, ఆకుకూరల సాగులో పాటించాల్సిన మెలకువలపై అవగాహన కల్గిస్తుంది.దీంతో కూరగాయల రైతులను ప్రోత్సహించడంతో పాటు సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తారు.