సైకో సాంబ జిల్లాలో లేడు… పోలీసుల నిర్ధారణ
విజయవాడ, జూలై 19 : సైకో సాంబ కృష్ణాజిల్లాలో లేడని పోలీసు అధికారులు నిర్దారణకు వచ్చారు. కొండపల్లి ఖిల్లాలో అతడి కోసం జరుగుతున్న గాలింపులు నిలిపివేశారు. కొండపల్లి ఖిల్లాలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని వెనక్కు రప్పించారు. వారం రోజుల క్రితం సైకో సాంబ కొండపల్లి ఖిల్లా నుండి కిందకు దూకేసి పరారు కావడం తెలిసిందే. అయితే అతడు ఖిల్లా నుండి తప్పించుకోలేదని భావించి దానిని పోలీసులు దిగ్బంధం చేశారు. అయితే సాంబ పోలీసుల అంచనాలను తలకిందులు చేస్తూ కొండపల్లి ఖిల్లా నుండి తప్పించుకొని ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించినట్టు మూడు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద అతడు కనిపించినట్టు స్థానికులు తెలిపారు. తదుపరి ఖమ్మం జిల్లాలో సాంబను చూశామని అక్కడి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిస్థితిని విశ్లేషించిన పోలీసు అధికారులు సాంబ ఇక కొండపల్లి ఖిల్లాలో ఉండే అవకాశమే లేదని ధృవీకరించుకొని గాలింపు చర్యలు ఆపేశారు.