సైరస్‌ తొలగింపు సరైన చర్యే: అభిషేక్‌ సంఘ్వీ

న్యూదిల్లీ: టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సరైస్‌ మిస్త్రీ తొలగింపు సరైన చర్యేనని రతన్‌ టాటా తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సంఘ్వీ తెలిపారు. ఇది పూర్తిగా ఆర్థిక, నైతిక కారణాలపై తీసుకున్న చర్య అని పేర్కొన్నారు. రతన్‌ టాటాతో రెండు గంటలపాటు భేటీ అయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తన తొలగింపు అన్యాయమని’ సైరస్‌ మిస్త్రీ చేసినన ప్రకటనను సంఘ్వీ ఎద్దేవాచేశారు. ‘బోర్డు పిచ్చిదనుకుంటున్నారా.. ఆయన మీద నమ్మకం కోల్పోయింది. మొత్తం తొమ్మిది మంది ఉన్న బోర్డులో ఆరుగురు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇద్దరు గైర్హాజరయ్యారు. ఆయనకు ఒక్క ఓటు కూడా రాలేదు.’ అని సంఘ్వీ వివరించారు.
ఆ నిర్ణయాన్ని ప్రశ్నించలేరు: సాల్వే
టాటా సన్స్‌ మిస్త్రీ తొలగింపుపై న్యాయపరంగానే వ్యవహరించిందని ప్రముఖ న్యాయవాది, టాటా గ్రూప్‌ సలహాదారు హరీష్‌ సాల్వే అన్నారు. ఈ నిర్ణయాన్ని న్యాయపరంగా ప్రశ్నించలేమన్నారు. రతన్‌ టాటా కొనుగోలు చేసిన కంపెనీలను విక్రయించే ముందు సైరస్‌ మిస్త్రీ బోర్డుతో సక్రమంగా చర్చించలేదన్నారు. ముఖ్యంగా యూకేలోని స్టీల్‌ ఆపరేషన్ల విక్రయం విషయంలో కూడా బోర్డుతో సరిగా సమావేశం కాలేదన్నారు.