సొంతపార్టీలోనే బిజెపికి వ్యతిరేక

జమిలి ఎన్నికలపై హర్యానా ఎమ్మెల్యే విసుర్లు

90శాతం మందికి ఓటమి తప్పదని హెచ్చరిక

చండీఘడ్‌,జూలై9(జ‌నం సాక్షి): జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఉర్రూతలూగుతున్న బీజేపీకి మెల్లగా సొంత పార్టీ నుంచి విమర్శలు పెరగుతున్నాయి. ఇప్పుడున్న సీట్లలో 90శాతం మంది గెలవరని అంటూఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసే అభ్యర్థుల్లో 90 శాతం మంది ఓటమి ఎదుర్కోవడం ఖాయమని జోస్యం చెప్పారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌ కుమార్‌ సైనీ… తమ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై ఇటీవల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కురుక్షేత్ర జిల్లాలోని టైగాన్‌ గ్రామంలో జరిగిన ‘లోక్‌తంత్ర బచావో’ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ… బీజేపీ సరైన విధానాలు, సదుద్దేశాలను పాటించడం లేదు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్‌తో పోటీ చేయనున్న 90 శాతం మంది ఓడిపోతారు అని ఆయన పేర్కొన్నారు. మరోమారు అధికారం కోసం ఉవ్వీళ్లూరుతున్న దశలో బిజెపికి సొంతపార్టీలో విమర్శలు ఎక్కువయ్యాయి. పైకి చెప్పేవారు కొందరయితే చెప్పనివారు మరికొందరు ఉన్నారు. మిత్రపక్షం ఐఎన్‌ఎల్‌డీపైనా సైనీ విమర్శలు సంధించారు. తీవ్రమైన అవినీతిఅరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని దుయ్యబట్టారు. ప్రసంగాలు చేసినంత మాత్రాన నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేరని స్పష్టం చేశారు. దీనికోసం క్షేత్ర స్థాయిలో దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పేదల సమస్యలపై పోరాడేందుకు సిద్ధమని హావిూ ఇచ్చారు. ఇటీవల కొన్ని రోజులుగా సొంత పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ సైనీ వార్తల్లో నిలుస్తున్నారు.