సొరంగం పనుల్లో అపశ్రుతి: పలువురికి గాయాలు

కొల్లాపూర్‌,మే23( జ‌నం సాక్షి):  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొల్లాపూర్‌ కృష్ణా తీరంలోని ఎల్లూరు, రేగుమానిగడ్డలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ఇక్కడి సొరంగం పనుల వద్ద బుధవారం సాయంత్రం పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సీఐ శ్రీరాం సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సొరంగ నిర్మాణం కోసం అధికారులు బాంబుల ద్వారా పేలుళ్లు జరిపి కొండలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఝార్ఖండ్‌, బిహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్రకు చెందిన కార్మికులు సొరంగంలో పనులుచేస్తుండగా.. ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. దీంతో సొరంగంలో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదవశాత్తు పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో 15 మంది కార్మికులు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శ్రీరాం సైదాబాబు క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.