సోనియాతో కేకే భేటీ

తెలంగాణపై చెప్పాల్సింది చెప్పా
కాంగ్రెస్‌ నేత కేశవరావు
న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) : పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కే.కేశవరావు గురువారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. త్వరలోనే పీసీసీ చీఫ్‌ మార్పు జరగనుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఆయన చాలాకాలం తర్వాత అధినేత్రితో భేటీ కావడం విశేషం. సోనియా నివాసం టెన్‌ జన్‌పథ్‌లో దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పీసీసీ మార్పు, ముఖ్యమంత్రి వ్యవహార శైలి, అసమ్మతి పోరు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. పీసీసీ, సీఎం మార్పుపైనే చాలాసేపు చర్చించినట్లు సమాచారం. బొత్స సత్యనారాయణ, కిరణ్‌కుమార్‌రెడ్డిల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు, అసమ్మతిని పెంచి పోషిస్తున్న తీరును కేకే అధినేత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక, తెలంగాణ విషయంలోనూ ఇద్దరి మధ్యా కీలక చర్చ జరిగినట్లు తెలిసింది.సోనియాతో తెలంగాణ అంశంపై చర్చించినట్లు కేకే తెలిపారు. అధినేత్రితో భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దాదాపు సంవత్సరం తర్వాత పార్టీ అధినాయకురాలితో సమావేశమయ్యాయనని రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియా ఆరా తీశారన్నారు. తన తరఫున తెలంగాణపై ఏమి మాట్లాడాలో అదే మాట్లాడానని చెప్పారు. సోనియాతో చర్చలు సంతృప్తికరంగా సాగాయని, కేంద్రం తెలంగాణపై త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన వ్యక్తిగత విషయాలపైనా చర్చించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి మార్పులపై తాను చర్చించలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.