సోనియాను, సీఎంను తెలంగాణ ఇవ్వమని బతిమిలాడం

టీ మంత్రులే తేెవాలి
మార్చ్‌తో కేంద్రంపై ఒత్తిడి పెంచగలిగాం
లగడపాటిని పట్టించుకోవడం మానేశాం
టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం
హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియాను, సీఎం అడుగబోమని, తెలంగాణ మంత్రులనే రాష్ట్రం తీసుకురావాలని నిలదీస్తామ ని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌ నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి పెంచగలిగామన్నారు. తాము ఊహించిన దాని కన్నా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు సాగర హారానికి తరలివచ్చి విజయవంతం చేశారని, తమపై నమ్మకం ఉంచి మార్చ్‌లో కదంతొక్కిన వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ తామూ రూపొందించే కార్యాచరణకు ఇలాగే స్పందించాలని కోదండరాం కోరారు. తెలంగాణ మంత్రులు ఎప్పుడు ఎక్కడ పర్యటించినా ప్రజలు, తెలంగాణవాదులు ప్రత్యేక రాష్ట్రం ఎప్పుడు తెస్తారని, వారిని శాంతి యుతంగా ప్రశ్నించాలని కోరారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలంగాణ రాదని, సమైక్య ఉద్యమం నడుపుతామని చెబుతున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా లగడపాటి రాజగోపాల్‌ గురించి తాము పట్టించుకోబోనని, ఆయన వ్యాఖ్యలపై మాట్లాడటమేసోనియాను, సీఎంను
మానేశానని కోదండరామ్‌ తెలిపారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు, నిర్బంధం విధించినా తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా వినిపించగలిగామన్నారు. తెలంగాణవాదులపై, తెలంగాణ కవాతుపై లగడపాటి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు తాను సిద్ధంగా లేనన్నారు. తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు విమలక్క టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌పై చేసిన వ్యాఖ్యల మీద కూడా తాను మాట్లాడనన్నారు. ఎవరి పద్ధతిలో వారు తెలంగాణ కోసం ఉద్యమించాలన్నారు. ఆమరణ దీక్ష గురించి చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నామని, అదే బ్రహ్మస్త్రం కాదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి, సోనియా గాంధీలను అడగబోమని తెలంగాణ మంత్రులనే అడుగుతామని ఆయన అన్నారు. ఉద్యమాన్ని, రాజకీయాన్ని వేర్వేరుగా చూడవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యమంలో రాజకీయ ప్రక్రియ ఉండరాదంటే నిర్ణయం రాదన్నారు. ఓ వైపు ఢిల్లీలో చర్చలు జరుపుతూనే మరోవైపు గల్లీలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తామని కోదండరామ్‌ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అల్లరి మూకను అణిచివేశామన్న ఆలోచనలో ఉన్నాయని, సమస్య పరిష్కారంపై మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. మార్చ్‌ సందర్భంగా ప్రభుత్వం ఉద్యమకారులను అణచివేయడాన్ని నిరసిస్తూ మంగళవారం నిరసన దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించాల్సిన దీక్షను ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు బాపూ ఘాట్‌ వద్ద నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. మార్చ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో జేఏసీలోని భాగస్వామ్య పక్షాల్లో సమన్వయం కుదరలేదన్నారు. జేఏసీ వేదిక నుంచి మరే ఇతర భాగస్వామ్య పక్షాన్ని విమర్శించనీయబోమని, ఆ మేరకు తీర్మానం చేస్తామని చెప్పారు. తమలోనూ కొందరు ఆంధ్రా పాలకుల ఏజెంట్లు ఉన్నారని, ఉద్యమానికి మచ్చ తెచ్చేలా హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాటిని ఆమోదించబోమని కోదండరాం చెప్పారు.