స్కూలు ఆటో-డిసిఎం ఢీ8మంది విద్యార్థులకు గాయాలు
అపస్మారకస్థితిలో ఆటో డ్రైవర్
హైదరాబాద్, జూలై 21: మీర్‌పేట సమీపంలోని మిథిలానగర్‌లో శనివారం సాయంత్రం ఆటో-డిసిఎం ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. మీర్‌పేటలోని స్పార్క్ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు స్కూలు ముగిసిన అనంతరం ఆటోలో రోజు మాదిరిగానే తమ తమ ఇళ్లకు శనివారం సాయంత్రం బయల్దేరారు. ఎదురుగా వచ్చిన డిసిఎం వ్యాను-ఆటో ఢీకొనడంతో ఎనిమిది మందిలో అయిదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ ప్రమాద సమయంలోనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అందర్ని వైద్యం నిమిత్తం సమీపంలోని విశ్వాస్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదకరంగా ఉన్న డ్రైవర్‌ను మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించేందుకు వైద్యులు యత్నిస్తున్నారు. ప్రమాద వార్త తెలుసు కున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది. వర్షం కురుస్తున్నా పంపండి అని యాజమాన్యం చెప్పడంతో స్కూలుకు పంపామని.. స్కూలు లేకపోతే ఇంటిలోనే తమతో పాటు ఉండేవారని వారన్నారు. ఇలా జరగడం తమ దురదృష్టకరమంటూ వారు రోదిస్తున్నారు.