‘స్థానిక’ ఎమ్మెల్సీ నోటిఫికేషన్
హైదరాబాద్,డిసెంబర్ 2 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో 12 మందిని శాసన మండలి సభ్యులుగా ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదలయింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో యిద్దరిని, మిగితా జిల్లాలో ఒక్కరిని శాసనమండలి సభ్యులుగా స్థానిక సంస్థల నుండి ఎన్నుకోనున్నారు. ఈ మేరకు ఇసి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఈ నెల 9 నామినేషన్లకు చివరి తేదీ కాగా, 10 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 30న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది.
వరంగల్ జిల్లాలో మొత్తం 860 మంది ప్రజా ప్రతినిధులకు ఓటింగ్ అవకాశం వుంది. మరో వైపు వరంగల్ కార్పొరేషన్ కు గత రెండేళ్ళు గా ఎన్నిక నిర్వహించకపోవడంతో కార్పోరేటర్లకు ఓటింగ్ అవకాశం లేదు.
మంగపేట, హనుమకొండ మండలాలలో కోర్టులో వాజ్యం మూలంగా ఎన్నికలు నిర్వహించలేదు. దరిమిలా యం.పి.టి.సిలకు ఓటింగ్ హక్కు లేదు. మెజారిటీ స్థానాలు అధికార టీఆర్‌ఎస్ కే వుండడంతో ఆ పార్టీ గెలుపు ఖాయం. అయితే ఎమ్మెల్సీ టికెట్ కి భారీ పోటీ ఉంది. ఇదిలావుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు పాలక టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌తో కలిసి సాగే అవకాశాలున్నాయన్న ఊహాగానాలకు పాలక పక్షం తెరదించింది. ఎన్నికల్లో ఒంటరిగానే సాగేందుకు వీలుగా.. పార్టీ నేతలు ఏర్పాట్లనూ చేసుకుంటున్నారు. 12 స్థానాలకూ అభ్యర్థులను నిలుపుతామని.. ఏ పార్టీతోనూ అవగాహనను కుదుర్చుకోబోమని టీఆర్‌ఎస్ తేల్చి చెప్పింది. విపక్షాలు సహకరిస్తే.. ఒకటి రెండు స్థానాలు వాటికి కేటాయించి.. ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. తాము ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోబోమని ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించింది. తాజాగా టీఆర్‌ఎస్ కూడా అదే తరహా ప్రకటన చేసింది. కాంగ్రెస్, టీడీపీలకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజా ప్రతినిధులున్న చోట్ల.. మండలి స్థానం దక్కించుకోవడం ఇబ్బందికరమని టీఆర్‌ఎస్
భావించింది అందుకే.. కాంగ్రెస్‌తో లోపాయకారీ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని యోచించింది. అయితే.. పాలకపక్షాన్ని దెబ్బతీసేందుకు.. కాంగ్రెస్ నాయకులు.. టీడీపీతో సఖ్యతకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో.. టీఆర్‌ఎస్ వ్యూహం మార్చిందంటున్నారు. వ్యూహాలకు పదును పెట్టిన టీఆర్‌ఎస్
ఒంటరి పోరు అనివార్యమని తేలడంతో.. టీఆర్‌ఎస్ నాయకత్వం.. తనదైన వ్యూహాలకు పదును పెట్టింది. స్థానిక సంస్థలకు చెందిన విపక్ష ప్రజా ప్రతినిధులను కారెక్కించడంతో పాటు.. పాలక పక్షంగా తన చేతిలో ఉన్న అన్ని అస్త్రాలనూ ప్రయోగిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ బలపడకుండా వ్యూహరచన చేస్తోంది. నోటిఫికేషన్ వెలువడ్డ నాటి నుంచి.. పోలింగ్ నాటి వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనే దృష్టి పెట్టింది. టికెట్లు ఖరారైన నేతలు ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు.