స్థాయిసంఘం సభ్యుల ప్రశ్నల పరంపర

బ్యాంకింగ్‌ రంగ పటిష్టానికి కృషిచేస్తున్నామన్న ఉర్జిత్‌

న్యూఢిల్లీ,జూన్‌12(జ‌నం సాక్షి ): బ్యాంకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పార్లమెంటరీ ప్యానెల్‌కు హావిూ ఇచ్చారు. పారు బకాయిలు, బ్యాంక్‌ అవినీతి కుంభకోణాలు, నగదు సంక్షోభం, ఇతర అంశాలపై ప్యానెల్‌ నుండి గవర్నర్‌ కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. నిరర్ధక ఆస్తులకు సంబంధించి తలెత్తిన ఈ సంక్షోభాన్ని అధిగమించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని కమిటీ సభ్యులు కొందరు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో కొన్ని ఎటిఎంల్లో నగదు లేకపోవడాన్ని ప్రస్తావించారు. బ్యాంకింగ్‌ కుంభకోణాలను అదుపు చేసేందుకు తగుచర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయనను ప్రశ్నించారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం ఎదుట ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ హాజరయ్యారు. సుమారు మూడున్నర గంటల పాటు స్థాయీ సంఘం సభ్యులు ఆయనను పలు అంశాలపై ప్రశ్నించారు. 2016 నవంబర్‌ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఇప్పటివరకు ఎంత నగదు తిరిగొచ్చిందో లెక్కలు చెప్పాలని స్థాయీ సంఘం ఆయనను ఆదేశించింది. అలాగే, దేశాన్ని కుదిపేసిన పీఎన్‌బీ కుంభకోణంపైనా ఆయనను ప్రశ్నించారు. ఇన్నేళ్ల నుంచి కుంభకోణం జరుగుతున్నా ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. ఏటీఎంలలో నగదు ఎందుకు సరిగా ఉంచలేకపోతున్నారు? నగదు కొరతకు ఎవరు కారణం? తదితర అనేక ప్రశ్నల్ని ఉర్జిత్‌పై కురిపించారు. అయితే, ఈ ప్రశ్నలన్నింటికీ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తానని ఉర్జిత్‌ స్థాయీ సంఘానికి స్పష్టంచేశారు.