స్పందన అద్భుతం
` బయో ఏషియా సదస్సు విజయవంతంపై మంత్రి శ్రీధర్‌బాబు హర్షం
` పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి):బయో ఏషియా`2025 సదస్సుకు తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. బయో ఏషియా సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘‘బయో ఏషియా చరిత్రలో ఈ ఏడాది సదస్సు ఒక మైలు రాయిగా నిలుస్తుంది. దేశ, విదేశాల నుంచి 4వేల మంది ఫార్మా, హెల్త్ కేర్ ఇండస్ట్రీ లీడర్స్, పాలసీ మేకర్స్, ఆవిష్కర్తలు హాజరయ్యారు. హెల్త్, ఫార్మా రంగాలకు చెందిన 100 మంది నిపుణులు ఆయా రంగాల్లో నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో 200కు పైగా బీ టూ బీ (బిజినెస్ టూ బిజినెస్) విూటింగ్స్ జరిగాయి. గతేడాది కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. అమెరికాకు చెందిన బయో టెక్నాలజీ దిగ్గజ సంస్థ ‘ఆమ్జెన్’ మన దగ్గర భారీగా పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థ వల్ల సుమారు మూడు వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఏడాది సదస్సుకు దేశ భవిష్యత్తును మార్చే సత్తా ఉన్న ప్రతిభ గల యువ ఆవిష్కర్తలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. వారి ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిన ఈ ఆవిష్కరణలు ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. మొత్తం 84 స్టార్టప్స్ సదస్సులో పాల్గొన్నాయి. ఆవిష్కరణలకు అండగా ఉండేందుకు, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు, పరిశ్రమలతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తెలంగాణను నాణ్యమైన మానవ వనరులకు హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్‌పై దృష్టి సారించాం. సంబంధిత రంగంలో అనుభవమున్న 4 పరిశ్రమల సహకారంతో ‘సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ’ పేరిట ప్రత్యేక కోర్సును ప్రారంభించాం. మొదటి బ్యాచ్‌లో 140 మంది విద్యార్థులు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 82 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. 60 శాతం మంది అభ్యర్థులు గ్రావిూణ ప్రాంతాలకు చెందిన వారే. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. విూతో పాటు కలిసి నడుస్తాం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని బయో ఏషియా`2025 వేదికగా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని శ్రీధర్‌బాబు తెలిపారు.