స్ఫూర్తిదాతకు ఘన నివాళి


abdul_kalam_f
దిల్లీ: మాజీ రాష్ట్రపతి, గొప్ప శాస్త్రవేత్త దివంగత డా. ఏపీజే అబ్దుల్‌ కలాం 85వ జయంతి సందర్భంగా ప్రముఖులు, సామాన్యుల నుంచి కూడా నివాళులు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియా సైట్‌ ట్విట్టర్‌ ద్వారా అందరూ కలాంను స్మరించుకుంటున్నారు. నేడు కలాం 85వ జయంతి. ఆయన 1931 అక్టోబరు 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు.తొలుత శాస్త్రవేత్తగా, ఆ తర్వాత భారత రాష్ట్రపతిగా(2002- 2007) సేవలందించి కలాం దేశప్రజల మన్ననలు పొందారు. ఎయిర్‌స్పేస్‌ ఇంజనీర్‌గా ఇస్రో, డీఆర్‌డీఓలో గొప్ప పరిశోధనలతో, బాలిస్టిక్‌ క్షిపణుల రూపకల్పనలో కలాం చేసిన కృషి దేశం ఎన్నటికీ మరువలేనిది. భారత రత్న, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ లాంటి ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు పొందారు కలాం. ఆయన 2015 జులై 27న 83వ ఏట విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు.

నేడు ఆయన జయంతి సందర్భంగా ఎందరో ప్రముఖులు ట్వీట్ల ద్వారా నివాళులర్పించారు. నెటిజన్లు కలాం చెప్పిన సూక్తులను, ఆయన స్ఫూర్తిమంతమైన ప్రసంగాలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. భరతమాత నిజమైన కుమారుడిని నేడు తప్పక స్మరించుకోవాలని, లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అంటూ ట్వీట్లు చేశారు.

‘మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా నివాళులు. ప్రతి భారతీయుడి కలల్ని నిజం చేసిన వ్యక్తి ఆయన.’

– ప్రధాని నరేంద్ర మోదీ
‘లక్షల మందికి స్ఫూర్తినిచ్చిన ప్రజల రాష్ట్రపతి డా.ఏపీజే అబ్దుల్‌ కలాం చిరస్మరణీయులు. కలాంజీ మిమ్మల్ని ఎంతగానో మిస్‌ అవుతున్నాం.’

– మమతా బెనర్జీ, పశ్చిమ్‌బంగ సీఎం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు సెల్యూట్‌. సాధారణంగా జీవిస్తూ గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తి. లక్షలాది భారతీయులకు ఆయన స్ఫూర్తి. చిరస్మరణీయులు.’

– వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి
‘శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి, గొప్ప వ్యక్తి, శాస్త్ర సాంకేతిక రంగంలో భారత దేశానికి విశేష సేవలందించిన అబ్దుల్‌ కలాంకు జయంతి సందర్భంగా నివాళులు.’

– అరుణ్‌ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి
‘భారత రత్న అబ్దుల్‌ కలాంకు జయంతి సందర్భంగా నివాళులు.’

-అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు
‘భారత రత్న ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నా. ఈరోజు ఆయన ఫొటోకు సెల్యూట్‌ చేయండి.’

-వీరేంద్ర సెహ్వాగ్‌, మాజీ క్రికెటర్‌