స్వగ్రామానికి చేరుకున్న భయ్యూజీ మృతదేహం

నివాళులర్పించిన ప్రముఖులు
మధ్యప్రదేశ్‌, జూన్‌13(జ‌నం సాక్షి) : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త భయ్యూజి మహరాజ్‌ (50) మంగళవారం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. మహరాజ్‌ ఇండోర్‌లోని తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకున్నారు. తీవ్రగాయాలతో ఉన్న ఆయనను ఇండోర్‌లోని బాంబే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన ఆసుపత్రిలో మృతి చెందారు. మహరాజ్‌ నివాసంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా బుధవారం ఉదయం భయ్యూజి మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు. భయ్యూజి సపోర్టర్స్‌ ఆయన స్వగ్రామానికి తరలివెళ్లారు. ఆయన మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సూసైడ్‌ నోట్‌లో మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉందని, అయితే మహరాజ్‌ మృతి వెనుక పూర్తి కారణాలపై ఇపుడే ఏం చెప్పలేమని డీఐజీ హరినారాయణ చారి మిశ్రా తెలిపారు. నిస్వార్థమైన సేవలతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించిన భయ్యూజ్‌ మహరాజ్‌ మరణం పట్ల మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మహరాజ్‌ దేశ సంస్కతి, సంప్రదాయాలను కాపాడుతూ ప్రజలకు విజ్ఞానాన్ని అందించారని అన్నారు. మహరాజ్‌ను కోల్పోవడం ప్రజలందరికీ తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.