‘స్వచ్ఛ’ బాదుడు

5

– 14.5 శాతానికి పెరిగిన సేవాపన్ను

దిల్లీ నవంబర్‌ 15 (జనంసాక్షి):

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘స్వచ్ఛ భారత్‌’లో పౌరులందరినీ భాగస్వాములను చేసే దిశగా ప్రభుత్వం ప్రతిపాదించిన ‘స్వచ్ఛ భారత్‌ సుంకం'(0.5 శాతం) ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.పన్ను విధింపుతో స్వఛ్చ బదుడు మొదలైంది.  దీంతో పన్ను విధింపునకు అర్హమైన అన్ని రకాల సేవలపై ప్రస్తుతం 14 శాతంగా ఉన్న సేవాపన్ను… 14.5 శాతానికి పెరిగింది. తాజా పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరంలో(వచ్చే ఏడాది మార్చి 31 వరకు) ప్రభుత్వ ఖజానాకు రూ.3,800 కోట్ల అదనపు ఆదాయం చేకూరుతుందని అంచనా. స్వచ్ఛ సుంకం ద్వారా ఏటా రూ.10 వేల కోట్లు వసూలవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వివిధ సేవలపై ఈ నెల 15లోగా జరిగిన చెల్లింపులు, ఈ నెల 29వ తేదీ లోపునకు సంబంధించిన చెలానా(ఇన్‌వాయిస్‌)లపై తాజా పెంపు ప్రభావం ఉండబోదని ఆర్థికశాఖ స్పష్టంచేసింది. సేవాపన్ను పెంపు కారణంగా ప్రథమశ్రేణి-ఏసీ రైలు ప్రయాణం, రెస్టారెంట్లు, టెలిఫోన్‌ తదితర సేవలు ప్రస్తుతం మరింత ప్రియమయ్యాయి. స్వచ్ఛ సుంకం ప్రభావం శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)ను పొందడంపై కూడా పడింది. పాన్‌ కార్డును జారీచేసేందుకు వినియోగదారుల నుంచి ఆదాయపు పన్నుశాఖ ఇప్పటివరకు రూ.106 వసూలుచేయగా… ఆదివారం నుంచి సదరు మొత్తం రూ.107కు పెరిగింది. భారత్‌ వెలుపల పాన్‌ కార్డును పొందడానికి ఇప్పటివరకు రూ.985 ఖర్చుకాగా… ప్రస్తుతం సదరు మొత్తం మరో నాలుగు రూపాయలు పెరిగింది.