హజరత్ బాబా 53వ గ్రంథోత్సవాలు ప్రారంభం
వివిజయనగరం జూన్ 30 : ఇక్కడి బాబామెట్టలో గల హజరత్ ఖాదర్ వలీబాబా 53వ గ్రంథోత్సవాలు శనివారం అతావుల్లా ఖాదరీబాబా నేతృత్వంలో ప్రారంభమయ్యాయి. జూలై 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆది, సోమవారాల్లో 48 గంటల పాటు పేదలకు నిర్విరామ అన్నదానం ఏర్పాటు చేశారు. ఉత్సవ ప్రారంభ చిహ్నంగా ఛాదర్ సమర్పణ, ఖురాన్ పఠనం జరిగింది. ఆదివారం జరిగే ఉరుసులో భాగంగా 10 గంటల పాటు బాబామెట్ట నుంచి ఊరేగింపు నిర్వహిస్తారు. అదేవిధంగా కవాళీ ప్రదర్శనలు, ఖురాన్ పఠనాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎటికె సేవా సంస్థ ముతావల్లి ఎండి ఖలీల్ వుల్లా భాషా, ప్రధాన కార్యదర్శి ఎం. విజయభాస్కర్ తెలిపారు. అంతేకాక బాబా వాడిన వస్తువుల ప్రదర్శన కూడా ఉంటుందని వీరు చెప్పారు.