హజారేని చంపే సమయం వచ్చింది… నేను కాబోయే గాడ్సేనంటూ కెనడా ఎన్నారై

ముంబై: సామాజిక కార్యకర్త, ప్రముఖ గాంధేయవాది అన్నా హజారేకు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ద్వారా బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీంతో అన్నా హజారే ఆఫీసు వర్గాలు ముంబైలోని థానే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కెనడాకు చెందిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిబ్రవరి 24-25 తారీఖున ఫేస్‌బుక్‌లో అన్నా హజారేను చంపుతామంటూ వచ్చిన బెదిరింపు సందేశాలపై మహారాష్ట్ర డీజీపీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర డీజీపీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కెనడాకు చెందిన ఎన్నారై గగన్ విధు ఫిబ్రవరి 24 మధ్యాహ్నాం “అన్నా హజారేను చంపాల్సిన సమయం ఆసన్నమైంది. నేను కాబోయే నాధూరామ్ గాడ్సే” అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడని తెలిపారు. ఈ పోస్టుని ముగ్గురు లైక్ చేశారు. ఈ బెదిరింపులపై గగన్ విధు ఫిబ్రవరి 25న మరోలా సమాధానమిచ్చాడు. “నేను తమాషా చేయడం లేదు. త్వరలో ఇండియాకు వెళుతున్నాను. మోడ్రన్ గాంధీ అన్నా హజారేను చంపడానికి గన్ సిద్ధం చేశాను. నాకు అరవింద్ కేజ్రీవాల్‌ అంటే ఇష్టం లేదు. అతన్ని నాశనం చేయడానికి ఏమి చేయడానికైనా నేను సిద్ధం” అని పోస్ట్ చేశాడు. హజారేని చంపే సమయం వచ్చింది… నేను కాబోయే గాడ్సేనంటూ కెనడా ఎ ఈ పోస్టు‌కి కొనసాగింపుగా “నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నా స్నేహితుడు నెయిల్ ఢిల్లీలో దీనిపై పని చేస్తున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ చరిత్ర బయటపెడతా, నేను జోక్ చేయడం లేదు. సీరియస్‌గా బెబుతున్నా. నా భరతమాత కోసం ఏమైనా చేసేందుకు నేను సిద్ధం” అని పోస్ట్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక భూసేకరణ చట్టంపై మూడు నెలల పాటు 1,100 కిలో మీటర్ల పాదయాత్ర చేయబోతున్నట్లు అన్నా హజారే ప్రకటించిన తర్వాత ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్‌లు చేయడం విశేషం. భూసేకరణ చట్టంలో సవరణల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులో రైతు వ్యతిరేక నిబంధనలు తొలగించాలని అన్నా హజారే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. బిల్లును మార్చాలని కోరుతూ మహారాష్ట్రలోని వార్ధా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి 1100 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. వార్ధాలో మహాత్మాగాంధీ నెలకొల్పిన సేవా గ్రాం నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదానం వరకు మూడు నెలలపాటు సాగుతుందని చెప్పారు. ఈ నెల తొమ్మిదిన సేవాగ్రాంలో జరిగే సమావేశంలో యాత్ర ప్రారంభ తేదీని నిర్ణయిస్తామని వెల్లడించారు. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇటీవలే ఆయన ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రెండురోజుల దీక్ష చేసినా ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం స్పందించకపోవటంతో ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు ఈ యాత్ర చేపడుతున్నారు.