హత్యానేరంపై జైలుకెళ్లిన యువకులు

16brk-fbబెంగళూరు: సినిమా ఫక్కీలో ఆవేశపడి, అనవసర తగాదాకు పోయి ఇప్పుడు జైల్లో వూచలు లెక్కపెడుతున్నారు కొందరు కుర్రాళ్లు. వారి మీద ఏకంగా హత్యానేరం మోపి విచారిస్తున్నారు పోలీసులు. బెంగళూరులో రెండు గ్రూపుల మధ్య ఒక అమ్మాయి కారణంగా మొదలైన వివాదం ఎంత దూరం వెళ్లిందంటే..

రాజాజీనగర్‌లో అజిత్‌ ఓ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. తన క్లాస్‌మేట్‌ అయిన ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడు. ఆ అమ్మాయి ఇంటి పరిసరాల్లో ఉండే కొందరు యువకులు ఇది గమనించారు. వారికి శివప్రసాద్‌ అనే యువకుడు నాయకుడు. అందరూ కలిసి ఈ విషయం మాట్లాడుకున్నారు. అనంతరం అజిత్‌ ఫేస్‌బుక్‌లో ఆ అమ్మాయిని వదిలెయ్యాలని, లేదంటే ముందు తమను ఎదుర్కోవాలని సందేశం పెట్టారు. అది చూసి ఆవేశపడిన అజిత్‌ వారికి కోపంగా సమాధానం ఇచ్చాడు. వివాదం ముదిరింది. బాహాబాహీ తేల్చుకోవాలనుకున్నారు. తమ తమ అనుచరులతో శనివారం రాత్రి పది గంటల సమయంలో కలుసుకున్నారు. ఆయుధాలతో సిద్ధమై వచ్చిన రెండు బృందాలూ విచక్షణారహితంగా దాడికి దిగి కొట్టుకోవడం చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తీవ్రంగా గాయపడిన యువకులందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. వారిపై హత్యానేరం నమోదు చేశామని, వివాదానికి ప్రధాన కారకులైన వారిని నేరుగా జైలుకు పంపామని పోలీసులు తెలిపారు.