” హరితహారంతో భవిష్యత్ తరాలకు జీవనాధారం – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 21( జనంసాక్షి): హరితహారం కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ వీలైనంతమేర మొక్కలు నాటాలని, అటవీ సంపద ఎంత పెరిగితే తద్వారా భవిష్యత్తరాలకు నీరు, గాలి, ఆహారాన్ని అందించడం ద్వారా జీవనాధారాన్ని కల్పించవచ్చని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి బొటానికల్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొటానికల్ గార్డెన్ లో వారు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి మీద పచ్చదనం హరించుకుపోయి కరువు కాటకాలతోపాటు పర్యావరణ విధ్వంసం జరిగి గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులకు దారితీస్తున్నాయన్నారు. దీనివల్ల యావత్ ప్రపంచం భూతాపంతో అల్లాడిపోతుందని, సకాలంలో వర్షాలులేక మానవాళి జీవనస్థితిగతులు పూర్తిగా మారిపోతున్నాయన్నారు. అందుకే భారతదేశం ఎంతో సగర్వంగా జరుపుకుంటున్న 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా చాలా ప్రాంతాలలో హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలు హరితహారం కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఎక్కడ ప్రభుత్వ స్థలం, ప్రైవేట్ స్థలం మొక్కలు నాటడానికి అనుకూలంగా ఉన్నా, ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గాంధీ, శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ వెంకన్న, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ అమిత్ పటేల్, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస్, బోటానిక్ గార్డెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి, సెక్రటరీ బాల కిషన్, అసోసియేషన్ సభ్యులు షేక్ చాంద్ పాషా, రాజు, దీరజ్, నాగరాజు, మూర్తి, శ్రీనివాస్, శ్రీను బాబు, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం యాదవ్, తెరాస నాయకులు నీరుడి గణేష్ ముదిరాజ్, నరసింహ సాగర్, రక్తపు జంగంగౌడ్, తిరుపతి యాదవ్, ఎర్రరాజు, గణపతి, కృష్ణ సాగర్, అశోక్ సాగర్, నరేష్ ముదిరాజ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.