హరితహారంపై అసెంబ్లీలో సుధీర్ఘచర్చ హరితహారంపై అసెంబ్లీలో సుధీర్ఘచర్చ 

– పలు సూచనలు చేసిన ప్రతిపక్ష నేతలు
– లక్ష్యంలేని హారంగా హరితహారం సాగుతుంది
– అసెంబ్లీలో ఎమ్మెల్యే డి.కె. అరుణ
– హరితహారం అద్భుతమన్న అక్బరుద్దీన్‌
– నీటిఎద్దడిని తట్టుకొనే మొక్కలు నాటాలని ఆర్‌.కృష్ణయ్య సూచన
హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న హరితహారంపై సుదీర్ఘచర్చ సాగింది.. ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీలకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు హరితహారం జరుగుతున్న తీరుపై మాట్లాడారు. తొలుత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గాంధారి కిషోర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ఓ యజ్ఞంలా చేపట్టారని తెలిపారు. 2015 జులై 3న చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద హరితహారానికి సీఎం శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు హరితహారం ఓయజ్ఞంలా కొనసాగుతుందని తెలిపారు. కొత్త చట్టాలతో చెట్లను కాపాడే ప్రయత్నం చేపట్టాలన్నారు. గత ప్రభుత్వాల హాయాంలో అటవీశాఖ ఏడాదికి కేవలం రూ. 13 కోట్ల వ్యయం చేసిందన్నారు. గత ప్రభుత్వాల కంటే ప్రస్తుత ప్రభుత్వం దాదాపు 30 రేట్లు అధికంగా వ్యయం చేస్తుందని కిషోర్‌ స్పష్టం చేశారు. అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. కోతుల గ్రామాల్లోకి వస్తున్నాయి.. వాటి విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. 24 శాతం నుంచి 33 శాతానికి అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
లక్ష్యంలేని హారంగా.. హరితహారం సాగుతుంది- డి.కె. అరుణ
పర్యావరణను కాపాడుకోవడానికి మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందని, కానీ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంలో నిజాయితీ లేదని ఎమ్మెల్యే డి.కె. అరుణ అన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో హరితహారం కార్యక్రమం తీరుపై ఆమె ప్రసంగించారు. నాలుగు గోడల మధ్య కూర్చొని భారీ లక్ష్యాలను పెట్టుకొని జనాన్ని అధికారులను సిద్ధం చేయకుండానే హరితహారాన్ని నిర్వహిస్తున్నారని, ఫలితంగా ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతుందన్నారు. 2019నాటికి 230కోట్ల మొక్కలు వచ్చే సంవత్సరం వరకు పూర్తవుతాయా.. వీటిని నాటడం పూర్తిగా పూర్తి చేయగలుగుతామా..? అని ఆమె ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకోవటంమే తప్ప.. కిందిస్థాయిలో జరుగుతున్న తీరును సీఎం గమనించాలని ఆమె కోరారు. అదేవిధంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల కోసం అటవీభూములు పోతున్నాయని, రోడ్ల విస్తరణ కోసంలో భాగంగా పెద్దపెద్ద చెట్లను నరికివేయటం జరుగుతుందన్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏ విధంగా మొక్కల పెంపకం చేపడుతుందని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. మూడున్నారేళ్లలో ఈ మధ్యనే అటవీశాఖలోని ఖాళీలకు నోటిఫికేషన్‌ ఇచ్చారని, హరితహారం లాంటి పెద్ద పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం సిబ్బంది లేకుండా పథకం లక్ష్యాలను చేరుకోలేమని తెలియదా అని ఆమె ప్రశ్నించారు. కేవలం భారీ లక్ష్యాలను పెట్టుకొని లెక్కలు రాసుకున్న మాత్రాన లక్ష్యాలను చేరుకోలేమన్నారు. చిత్తశుద్దితో ముందుకు సాగితేనే లక్ష్యాలను సాగించగలమని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని డి.కె. అరుణ ప్రభుత్వానికి సూచించారు. హరితహారం కోసం ఇప్పటి వరకు 2వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు చెబుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటి వరకు 81కోట్ల మొక్కలు
నాటామని చెబుతున్నారని, ఈ మొక్కలు నాటితే తెలంగాణాలో అడుగుపెట్టే చోటు కూడా లేకుండా పచ్చగా కనపడాలన్నారు. కానీ పరిస్థితి అలా లేదని, అంటే హరితహారం క్షేత్రస్థాయిలో అనుకున్నంత మేరకు సాగటం లేదని తెలుస్తుందన్నారు. మొక్కలెన్ని పెట్టారు.. బతికన మొక్కలు ఎన్ని.. కాగిఆలకు వాస్తవానికి పొంతన ఉందా..? అనే అంశాలపై సభాసంఘం వేసి దాని ద్వారా పరిశీలించాలని డి.కె. అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
హరితహారం అద్భుత కార్యక్రమం – అక్బరుద్దిన్‌ఓవైసీ
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన హరితహారం అద్భుతమైన కార్యక్రమం కొనియాడారు. శాసనసభలో హరితహారంపై చర్చ సందర్భంగా ఓవైసీ మాట్లాడారు. సమైక్య పాలనలో అడవులు అంతరించిపోయాయని గుర్తు చేశారు. అడవులను ఇష్టానుసారంగా నరికినా గత పాలకులు పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు మళ్లీ పచ్చదనాన్ని చిగురింపజేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఓవైసీ. ఆరంభం నుంచే హరితహారం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు. 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం గొప్ప విషయమన్నారు. 2016 సంవత్సరంతో పాటు ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదైందన్నారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన
లక్ష్యం మంచిది అయినా అది ఆచరణలో ఫలితాలు ఇవ్వటం లేదన్నారు. కేవలం లక్ష్యాలను నిర్దేశించుకోవటం కాదని, వాటికి తగిన విధంగా ప్రణాళికతో ముందుకు సాగాలని, ఆ మేరకు సాగడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకొనే విధంగా ఉండే మొక్కలను నాటాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ .. హరితహారంకార్యక్రమంలో భాగంగా నీటిని ఎద్దడిని తట్టుకొని పెరిగే మొక్కలు నాటాలని సూచించారు. చాలా ప్రాంతాల్లో మొక్కలు విజయవంతంగా నాటుతున్నప్పటికీ వాటి పెంపకంలో చర్యలు ఆశించిన మేర లేవన్నారు. దీనికితోడు నీటి ఎద్దడితో మొక్కలు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఇప్పుడు నాటుతున్న చెట్లతో పాటు నీటి ఎద్దడిని తట్టుకునే చెట్లను కూడా నాటాలని ప్రభుత్వానికి సూచించారు. టేకు, జామ, మామిడి చెట్లతో పాటు.. రాగి, వేప, చింత చెట్లను అధికంగా పెంచాలన్నారు. అదే విధంగా.. హరితహారంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక మాధ్యమాలు, విూడియా ద్వారా హరితహారంపై విస్తృత ప్రచారం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కృష్ణయ్య కోరారు. చెట్లను నరికే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ అటవీ భూముల్లో మొక్కలు నాటాలని సూచించారు.

తాజావార్తలు