హరితహారంపై గ్రామస్థాయిలో చైతన్యం రావాలి
సిద్దిపేట,జూలై24(జనంసాక్షి): అన్ని గ్రామాలను హరితవనాలుగా మార్చాలని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎవరికి వారు కనీసం ఒక మొక్కానటి సాకాలన్నారు. అప్పుడే మనకు పర్యావరణ సమస్యలు ఉండవన్నారు. రాష్ట్రంలో అంతరించిన పోయిన అడవులను తిరిగి పెంచేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. అందుకే హరితహారాన్ని యుద్ధ ప్రాతిపాధికన చేపడుతున్నారని తెలిపారు. సిఎం స్వయంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హరితహారాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో 50వేలకు తగ్గకుండా మొక్కలు నాటించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారన్నారు. తన నియోజకవర్గ వ్యాప్తంగా మొక్కలు
నాటేందుకు చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. ముఖ్యంగా పెరట్లో, రోడ్లకు ఇరువైపుల, పొలాలు, చెరువు గట్ల వెంట, ఫారెస్ట్ భూముల్లో మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా హరితహారంలో పాల్గొనాలని, కనీసం నాలుగు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. గ్రామాల్లోని ప్రజలచే మొక్కలు నాటించే బాధ్యతను యువత తీసుకోవాలని, వారిని ఆదిశగా చైతన్యం చేయాలని సూచించారు. దేశంలోనే వెనుకబాటుకు గురైన తెలంగాణ రాష్ట్రం.. నాలుగేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ.. సంక్షేమంలోనే ఆదర్శంగా నిలిచామని రామలింగారెడ్డి పేర్కొన్నారు. అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన తెలంగాణ రాష్ట్రం.. సీఎం కేసీఆర్ చొరు వతో బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జిల్లాలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం అవుతాయన్నారు. గ్రామంలోని ఇళ్లు లేని వారందరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని, స్థల సేకర ణలో వివాదం లేకుండా చూసుకోవాలని కోరారు. గ్రామంలోని బోయ వాల్మీకుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హావిూ ఇచ్చారు.