హరితహారంలో గొల్లకురుమలు పాల్గొనాలి

గొర్రెలకు పచ్చిక మేతకు అవకాశం వస్తుంది

మెదక్‌,జూలై9(జ‌నం సాక్షి): ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో గొల్లకురుమలు భాగస్వాములు కావాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పచ్చదనం కోసం చేపట్టిన హరితహారం పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడంతో పాటు గొర్రెల కోసం అవసరమైన మొక్కలను గడ్డి పెంచాలన్నారు. ప్రతి యూనిట్‌ పొందిన లబ్దిదారుడు గ్రాసానికి ఉపయోగపడే 20 మొక్కలను నాటి వాటి సంరక్షణకు బాటలు వేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ మూగజీవాలకు అందుబాటులో ఉండే విధంగా అంబులెన్స్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నాని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా అభివృద్ధి చెందడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనలేని కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. వారి బాగోగుల కోసం సిఎం అహర్నిషలు కష్టపడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వం అందించిన సహకారంతో ఆర్థికంగా ఎదగాలని అన్నారు. వివిధ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఉమ్మడి మెదక్‌ జిల్లాకు రూ. 21 కోట్లు మంజూరయ్యాయన్నారు. గొర్ల కాపరుల కోసం ఒక్కో యూనిట్‌కు రూ. 1.25 లక్ష చొప్పున 75 శాతం సబ్సిడీతో ఈ పథకాన్ని వర్తింపజేస్తుందన్నారు. గొల్ల కురుమలు కేవలం రూ. 31వేలు చెల్లిస్తే 20 గొర్రెలు, ఒక పొటేలును ప్రభుత్వం అందిస్తుందన్నారు. వెటర్నరీ అధికారుల ద్వారానే లబ్ధిదారులు వెళ్లి గొర్రెలు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. గొల్ల కురుమల ఆదాయం పెరిగేలా రాష్ట్రంలో రూ. 30వేల కోట్ల సందప వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు చూస్తుంటే ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. గొల్ల కురుమల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వంలోనే అమలు చేస్తున్నామన్నారు. గొల్ల కురుమలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.