హరితహారం విజయవంతం కావాలి: కలెక్టర్‌

నల్గొండ,జూలై7(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపటనున్న హరితహారాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు కృషి చేయాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో మొక్కలు నాటేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవోలకు సూచించారు. పారిశ్రామికవేత్తల సహకారంతో రహదారులకు ఇరుపక్కలా మొక్కలు నాటాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో చేపట్టే హరితహారం కార్యక్రమానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గ్రామాల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని కచ్చితంగా పూర్తి చేయాలని సూచించారు. మొక్కలు నాటడంతో సరిపెట్టుకోకుండా వాటి సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంలో ప్రజాప్రతినిధులను, హరిత రక్షణ కమిటీలను భాగస్వాములుగా చేయాలని సూచించారు. ఇకపోతే బహిరంగ మలమూత్ర విసర్జన లేని జిల్లాగా మార్చేందుకు అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పని చేయాలని గౌరవ్‌ ఉప్పల్‌ పిలుపునిచ్చారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా చేయడానికి ఒక క్రమ పద్ధతిలో కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలన్నారు. 2018 నాటికి ఓడీఎప్‌ జిల్లాగా ప్రకటించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో నూటికి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. నూటికి నూరు గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్‌ ప్రాంతాలుగా గుర్తించేందుకు కృషి చేయాలన్నారు.

—–