హర్మన్‌ ప్రీత్‌ ఫేక్‌ డిగ్రీ

పోలీస్‌ ఉద్యోగంలో డిమోషన్‌ తప్పదేమో

అమృత్‌సర్‌,జూలై10(జ‌నం సాక్షి ): నకిలీ డిగ్రీతో పంజాబ్‌ పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని సంపాదించుకున్నట్లు భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ హర్మన్‌ప్రీత్‌ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆమెను డీఎస్పీ పదవి నుంచి తొలగించి కానిస్టేబుల్‌ ఉద్యోగం ఇవ్వనున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. భారత్‌ తరఫున అద్భుత ప్రదర్శనలు చేసినందుకు పంజాబ్‌ ప్రభుత్వం హర్మన్‌కు డీఎస్పీ పదవి ఇచ్చి గౌరవించింది. ఈ ఏడాది మార్చి 1న ఆమె డీఎస్పీ బాధ్యతలు కూడా చేపట్టింది. అయితే ఈ ఉద్యోగం కోసం ఆమె మేరట్‌లోని చరణ్‌ సింగ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. హర్మన్‌ అందించిన సరిఫికెట్ల పరిశీలన చేపట్టగా ఆ విశ్వవిద్యాలయంలో ఆమె డిగ్రీ పూర్తిచేసినట్లు ఎక్కడా వివరాలు లేదు. దీంతో హర్మన్‌ సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవిగా పంజాబ్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని పోలీసు శాఖ అధికారులు ప్రభుత్వానికి వివరించారు. దీంతో 12వ తరగతి మాత్రమే పాసైనట్లు ప్రభుత్వం భావించి ఆమె ఒప్పుకుంటే కానిస్టేబుల్‌ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమె క్రికెట్‌ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమెపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని వారు చెప్పారు. భారత మహిళల టీ20 జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వహిస్తోన్న హర్మన్‌ప్రీత్‌ అర్జున అవార్డు కూడా అందుకుంది. కియా సూపర్‌ లీగ్‌లో ఆడేందుకు స్మృతి మంధానతో కలిసి హర్మన్‌ప్రీత్‌ త్వరలో ఇంగ్లాండ్‌ వెళ్లనుంది.