హర్యానా ప్రభుత్వంపై.. 

ఒలింపిక్‌ క్రీడాకారుల ఆగ్రహం
న్యూఢిల్లీ, జూన్‌8(జ‌నం సాక్షి) : క్రీడాకారుల సంపాదనలో మూడో వంతు రాష్ట్ర క్రీడా మండలికి ఇవ్వాలన్న హర్యానా ప్రభుత్వ ఆదేశాలపై ఒలింపిక్‌ క్రీడాకారులు సాక్షి మాలిక్‌, సుశీల్‌ కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వోద్యోగాలు పొందిన క్రీడాకారులు తమ వృత్తిపరమైన క్రీడలు లేదా వాణిజ్యపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నపుడు సంపాదించే సొమ్ములో 33శాతం రాష్ట్ర క్రీడా మండలికి చెల్లించాలని ఏప్రిల్‌ 30న హర్యానా ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆదేశాలపై ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ స్పందిస్తూ తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్మును లాక్కోవాలనుకోవడం తప్పు అన్నారు. అంతకన్నా ఎక్కువగా ఏవిూ చెప్పలేనన్నారు. ఈ ఆదేశాలను తాను మరింత బాగా పరిశీలించవలసి ఉందన్నారు. అయితే ఈ ఆదేశాలు ప్రోత్సాహకరంగా లేవన్నారు. రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ మాట్లాడుతూ హర్యానా ప్రభుత్వం తన విధానాన్ని మరోసారి పరిశీలించాలన్నారు. సీనియర్‌ క్రీడాకారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలను సేకరించి, ఓ విధానాన్ని రూపొందించాలని కోరారు. ఇటువంటి విధానాల వల్ల క్రీడాకారుల నైతిక స్థయిర్యం దెబ్బతింటుందని, అంతేకాకుండా వారి ఆట తీరుపై కూడా ప్రభావం పడుతుందని ఆరోపించారు. 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణపతక విజేత, రెజ్లర్‌ బబిత కుమారి
ఫోగట్‌ మాట్లాడుతూ క్రీడాకారులు ఎంతగా శ్రమిస్తారో ప్రభుత్వానికి కనీసం అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. ఆదాయంలో మూడో వంతు ఇచ్చేయాలని ఎలా అడుగుతారు? అని మండిపడ్డారు. దీనికి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చేది లేదన్నారు. ప్రభుత్వం కనీసం తమను సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుని ఉండవలసిందన్నారు. హర్యానా ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏదైనా శాఖ లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ వ్యవస్థల్లో పని చేస్తున్న క్రీడాకారులు టోర్నమెంటుల్లో పాల్గొనేందుకు అసాధారణ సెలవు మంజూరు చేస్తారు. ఈ సెలవుల్లో వారికి వేతనం చెల్లించరు. ఈ పోటీల ద్వారా వీరు సంపాదించిన సొమ్ములో మూడో వంతును రాష్ట్ర క్రీడా మండలికి చెల్లించాలి.