హావిూలను విస్మరించిన సిఎం కెసిఆర్
ఆదిలాబాద్,జూన్15(జనంసాక్షి): దళిత సిఎం హావిూతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపితే అంతా కెసిఆర్ వెంట నడిచారని, కాని దానిని ఆయన తుంగలో తొక్కారని ఎంఆర్‌పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి మల్లేష్ అన్నారు. అమరవీరుల త్యాగాలను విస్మరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దొరతనాన్ని తలపిస్తోందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమించిన వారిని విస్మరించి కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దళితులనే సీఎం చేస్తానని నమ్మబలికిన కేసీఆర్ పదవీ కాంక్షతో తానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారన్నారు. కుటుంబ సభ్యులకు మంత్రుల పదవులు ఇచ్చారన్నారు. తన కుమార్తెను కేంద్ర మంత్రిగా చేయాలనే ఉద్దేశంతో బిజెపితో పొత్తుకు మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన టిడిపి నేతలను తెరాసలో చేర్చుకొని వారికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల ఆశలు,ఆశయాలు ఎప్పుడో దెబ్బతిన్నాయని, కొత్తగా తెలంగాణ కోసం సిఎం కెసిఆర్ పాటుపడతారన్న నమ్మకం లేకుండా పోయిందని అన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో దళితులకు అన్యాయం జరుగుతోందని, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వంపై ఎంఆర్‌పీఎస్ రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. దళితులకు, మహిళలకు మంత్రివర్గంలో చోటు లేకుండా చేశారన్నారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వారిని అవమాన పరచడమేనన్నారు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు నిరుద్యోగులకు స్పష్టమైన హావిూ దక్కలేదన్నారు.