హావిూల అమలుకు కార్యాచరణ చేయాలి: సిపిఎం

నల్లగొండ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ హావిూల అమలుకు తక్షణం సిఎం కార్యాచరణ ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఇవన్నీ కెసిఆర్‌ ఇచ్చిన హావిూలే గనుక వాటిపై స్పష్టత ఇవ్వాలన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం  భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు.  భూ సేకరణ చట్టానికి సవరణ చేయడం ద్వారా పేదరైతులకు అన్యాయం జరగగలదని అన్నారు. పార్లమెంట్‌ చట్టాన్ని కాలరాసి.. ప్రభుత్వం పేదల భూముల కబ్జా చట్టం తెచ్చిందని విమర్శించారు. జీవోలతో పేదల భూములు లాక్కునేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పేదలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత నిర్ణయాలు, ప్రజావ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారు.  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులు కానీ.. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల వింత విన్యాసాలతో ప్రజలు ప్రేక్షకులయ్యారని విమర్శించారు. ప్రజాప్రతినిధులు స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు.  ప్రజలకు ఇచ్చిన హావిూలు అమలు చేయడంలో తంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  విమర్శించారు. తెరాస ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, రుణమఫీని సైతం సక్రమంగా చెల్లించలేదని అన్నారు. గడిచిన నాలుగేళ్లల్లో ప్రజలకు ఈ ప్రభుత్వాలు ఎటువంటి మేలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణ జెండా మోసిన ఉద్యమ కారులను కేసీఆర్‌ ఏనాడో మరిచాడని ఎద్దేవా చేశారు. అయినా ప్రజలుకెసిఆర్‌కు ఓటేశారు గనక హావిూల అమలులో చిత్తశుద్ది చాటాలన్నారు.

తాజావార్తలు