హిందూ, ముస్లింల లడాయితో రాజకీయ లబ్ధిపొందలేరు

1
– భాజాపా, ఆర్‌ఎస్‌ఎస్‌, మోదీ మతతత్వ రాజకీయాలకు చెంపపెట్టు

– ఇకనైనా పనిమొదలుపెట్టు

– రాహుల్‌

దిల్లీ నవంబర్‌ 8 (జనంసాక్షి):

హిందూ ముస్లింల మధ్య లడాయితో ఎన్నికల్లో రాజకీయ లబ్ధీ పొందలేరని, భాజాపా ఆర్‌ఎస్‌ఎస్‌ మోదీ మతతత్వా రాజకీయాలకు ఈ ఫలితాలు చెంపపెట్టు అని,

కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం కావాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మహాకూటమి విజయానికి కృషి చేసిన నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా తీర్పును మోదీ ్ణొరవించాలని సూచించారు. ఇప్పటికైనా ప్రచారాలు, మాటలు కట్టిపెట్టి పని మొదలు పెట్టాలన్నారు. రైతుల బాధలు పట్టించుకోవాలని, యువత మనోభావాలు తెలుసుకోవాలని వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

చిగురించిన కాంగ్రెస్‌

బిహార్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందిన స్థానాలు. జాతీయ పార్టీగా ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ బిహార్‌లో మాత్రం దశాబ్ధ కాలంగా తన ప్రాభవాన్ని చాటుకోలేకపోయింది. అయితే తాజాగా వెలువడిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 27 స్థానాల్లో గెలుపొంది తన ఉనికి చాటుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ దెబ్బకు మోడు వారిన కాంగ్రెస్‌ వృక్షం తాజా ఫలితాలతో చిగురించినట్లైంది.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్రంలో(యూపీఏ-1,2) అధికారంలో ఉన్నప్పటికీ, బిహార్‌పై కాంగ్రెస్‌ తనదైన ముద్ర వేయలేకపోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన 2014 సార్వత్రిక ఎన్నికలతో ఆ పార్టీ పరిస్థితి ‘పెనం మీద నుంచి పొయ్యిలోకి’ పడినట్లు అయింది. దేశం యావత్తు మోదీ జపం చేయడం, యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలు ఇవన్నీ ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచాయి. దీంతో ప్రజా తీర్పును ్ణొరవించక తప్పలేదు.

బిహార్‌ ఎన్నికలకు ముందు…

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టారు. ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తమదేనని సోనియా, రాహుల్‌గాంధీలు అంగీకరించారు. అనంతరం జరిగిన జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు కూడా కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తేలేకపోయాయి. అనూహ్య పరిణామాల మధ్య ఈ ఏడాది మొదటిలో దిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అంతకు ముందు దక్కించుకున్న 8 స్థానాలను సైతం కోల్పోయింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అనంతర కాలంలో రాజకీయంగా పట్టు సాధించడానికి ‘హస్తం’ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వలేదు. పదే పదే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించినా ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు తెరలేవడంతో కాంగ్రెస్‌ తన ఉనికిని చాటుకోకతప్పలేదు.

బిహార్‌ ఎన్నికల సమయంలో…

రాజకీయంగా కాంగ్రెస్‌ ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నడి సంద్రంలో మునిగిపోతున్న వ్యక్తికి వూతం దొరికినట్లైంది. మరోపక్క అప్పటికే భాజపాతో తెగతెంపులు చేసుకున్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌, ఆర్జేడీ అధినేత లూలు ప్రసాద్‌ యాదవ్‌లతో కలిసి ‘మహాకూటమి’గా ఏర్పడానికి స్నేహ’హస్తం’ చాచింది. సీట్ల కేటాయింపులో కూడా గట్టిపట్టు పట్టకుండా కేవలం 41 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మిత్రపక్షాలు జేడీయూ, ఆర్జేడీలు చెరో 101 స్థానాలు పంచుకున్నాయి. ఇక ప్రచారంలో రాష్గానికి నితీశ్‌ చేసిన అభివృద్ధిపై అంతగా మాట్లాడని కాంగ్రెస్‌, ఎన్‌డీఏ, మోదీలపైనే వాగ్బాణాలు ఎక్కుపెట్టింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు ఇక తమదైన శైలిలో ప్రచారం చేశారు.

ఎన్నికల అనంతరం..

తాజాగా వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ 27 స్థానాలు దక్కించుకుని తన ఉనికిని చాటుకుంది. జేడీయూ, ఆర్జేడీలతో జట్టు కట్టడంతో కాంగ్రెస్‌కు లాభించింది. గత నాలుగు ఎన్నికల్లో గెలుపొందిన స్థానాలకన్నా ఈ సారి ఎక్కువే దక్కించుకుంది. దీంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి, కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. బిహార్‌ ఎన్నికల ఫలితాలతో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.