హిజాబ్ రాజకీయం ముసుగులో..
“హిజాబ్” అనే పదం అరబిక్ పదమైన ‘హజబా’ నుంచి వచ్చింది. స్త్రీల సహజసిద్దమైన శరీరాకృతిని, అందాన్ని సమాజంలో ఇతర మగవాళ్ల దృష్టిలో పడకుండా కాపాడుకోవడానికి వారికిచ్చిన ఓ సలహ. ఇది ఇస్లామిక్ ధర్మం. ఓ ఆచారం. ప్రతీక. అంతేగాని, హిజాబ్ పాటించిన ముస్లిం మహిళలు ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు కారు. దురదృష్టవశాత్తున ముస్లిం మహిళల హిజాబ్ ను అదేదో భూతం, పిశాచం లా కొందరు హిందూ ఫండమెంటులిష్టుల ద్వారా రంగు అద్దుతున్నారు. దుష్ట రాజకీయ నాయకులు దానికి వంత పాడుతున్నారు. సమసమాజంలో కేవలం దురభిప్రాయాన్ని చాటుతున్నారు.
ముస్లిం స్త్రీ మగవారికి బానిసకాదు. సహచారిణి. జీవిత భాగస్వామి. కుటుంబానికి యజమానురాలు.
భారత దేశపు పౌరురాలు. సమాజం లో వ్యక్తి.
నాగరికత ప్రారంభమైనప్పటి నుండి దుస్తులు ఎల్లప్పుడూ సుందరత లేదా మంచిమర్యాద తో ముడిపడి ఉన్నాయి. అవి గౌరవ మర్యాదలకు నాంది.
జుట్టు, మెడ మరియు ఛాతీను కప్పి ఉంచడానికి తల పై వేసుకునే ఓ గుడ్ద, స్కార్ఫ్. ఇదో ముస్లిం మహిళల ఐడెంటిటీ. దీన్ని ధరించడమా లేదా అన్న విషయం వారికి సంబంధించినది. ఒకరి బలవంతం, ప్రమేయం ఏమీ లేదు. తన మతానుసారం దుస్తులు వేసుకోవడానికి మన సంవిధానం ఇచ్చిన వరం.
ఇస్లాం పై అవగాహన లేనివారు హిజాబ్ ధరించే స్త్రీలను పోర్టబుల్ జైలుగా భావించబడుతున్నన్నట్లు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. సామాన్య ప్రజలను అపార్ధానికి గురిచేస్తున్నారు. ముస్లిం మతం పై పూర్తిగా అవగాహన లేని, అన్నెం-పున్నెం ఎరుగని బడిపిల్లల లేత పసి హృదయాలలో విషపు బీజాలు నాటుతున్నారు కేవలం రాజకీయ లబ్ది కోసం!
పరమత సహానం అలపరచుకోవాలని బోధించే పాఠశాలలే అసహ్య వాతావరణాన్ని సృష్టించడం సిగ్గు చేటే! ఉన్నట్టుండి డ్రెస్ కోడ్ వంక తో అమ్మాయిలను విద్యాలయాల్లో ప్రవేషం నిషేధించడం విచారకరం.
స్కూల్స్, కాలేజీలలో ఇదో వైరస్ వ్యాధిలా రూపాంతరం చెంది, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రాలకు వ్యాపించడం గమనిస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఇదో భయంకర వ్యాధి. కరోనా తో ప్రాణాలను గుప్పిట్లలో పెట్టుకొని జీవిస్తూనే ఉన్నాం. మత-ద్వేషం లాంటి మరో మహామారిని భరించలేం.
మన దేశ ప్రాచీన సంస్కృతిని గమనిస్తే, ప్రాచీన సాహిత్యాన్ని పఠిస్తే, మహిళలు తమ తలకు చుట్టుకునే లేదా శిరస్సును కప్పుకునే వస్త్రాలకు సంబంధించి క్రీ.శ. ఒకటో శతాబ్దం నుంచి క్రీ.శ. మూడో శతాబ్దం వరకు ప్రాచీన సాహిత్య ఆధారాలు లభ్యమై య్యాయి. వాటిలో ‘శిరోత్తర పట్టిక ‘ గురించి “దివ్వదాన” లో పేర్కొనడం జరిగింది. అలాగే తలకు నిండుగా చుట్టుకునే పెద్ద వస్త్రపు ముక్కనే బహుశా “అవగుంతన” గా కాళిదాసు పేర్కొని ఉండొచ్చు. “మల్వవికాగ్నిమిత్రమ్” లోని ఒక ప్రకరణములో వధువుకు సంబంధించిన వేషధారణ పై ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి. అందులో తలకు చుట్టుకునే వస్త్రం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడేదనే వివరణ ఉంది. తలను కప్పి ఉంచే వస్త్రానికి సంబంధించిన మరో కథనం “అభిజ్ఞాన శాకుంతలం” లోనూ ఉటకించబడింది. దుశ్యంతుడితో శకుంతల పరిచయం జరిగే సమయంలో తాను మేలి ముసుగు ధరించి ఉన్నానని, తనను తాను వర్ణించుకునే సందర్భంలో చెబుతుంది.
హిజాబ్ పై కర్నాటకలోని కొన్ని ప్రాంతాలలోని విద్యా సంస్థల విధ్యార్ధినుల ప్రవేశాన్ని నిషేధించడం పై లేస్తూన్న దుమారం పెనుతూఫానులా మారే ప్రమాదం కాన వస్తోంది.
ఎన్నికల ముందు ఇలాంటి అరాచకాలు లేవదీయడం దురుద్దేశ్య రాజకీయాలలో వింతేమి కాదు. దీని వల్ల లబ్ది పొందే వారెవరో అర్ధం జేసుకోవచ్చు. ప్రస్తుత సమయంలో విద్యాలయలు మూతపడి తే మన పిల్లలే.
‘బేటీ పడావో, బేటీ బచావో’ మోదీగారి నినాదం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందంటే అతిశయోక్తి కాదు.