హిమాచల్‌లో భారీ పోలింగ్
75 శాతం పోలింగ్ నమోదు
డిసెంబర్ 20న ఫలితాలు
సిమ్లా, నవంబర్ 4 (జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో పోలింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభ మైంది. ఉదయం 11 గంటల వరకు అన్ని ప్రాంతాల్లోను పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌లోని 68అసెంబ్లీ స్థానాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
68.. 459 మంది.. ధరల పెరుగుదల ప్రభావం ఆదివారం నాటి పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ మరోసారి పీఠాన్ని
అధిష్టించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా వీరభద్రసింగ్ నేతృత్వంలో అధికారం చేజిక్కించుకోవాలని పోరాడుతోంది. మొత్తం 68 నియోజక వర్గాల్లో 459 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 7253 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. బిఎస్‌పి-66, హిమాచల్‌ప్రదేశ్ లోకిత్ పార్టీ 36 స్థానాల్లోను, తృణమూల్ కాంగ్రెస్ 25 స్థానాల్లోను, ఎస్‌పి 16 స్థానాల్లోను, సీపీఎం 15, సిపిఐ 7, శివసేన 4, నేషనలిస్టు కాంగ్రెస్ 12, స్వాభిమాన్ పార్టీ 12 స్థానాల్లోను పోటీ చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్ధులు 105 మంది కూడా తమ తలరాతను పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. ఇదిలా ఉండగా డిసెంబరు 20వ తేదీన ఓట్ల లెక్కింపు కొనసాగనున్న విషయం తెలిసిందే.
పురుష ఓటర్లే అధికం..
ఎన్నికల బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థుల సంఖ్య..459. పురుష అభ్యర్థులు 425మంది కాగా మహిళలు 34మంది. 68 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 46,08,359మంది. వారిలో పురుష ఓటర్లు 23,76,587 మంది, కాగా 22,31,772 మహిళా ఓటర్లు. అత్యధిక మంది బరిలో నిలిచిన అభ్యర్థులు డెహ్రా కాగా.. అత్యల్ప సంఖ్యలో బరిలో నిలిచిన నియోజకవర్గాలు చురా, నైడం.డెహ్రాలో 16మంది అభ్యర్థులు.. చురా, నైడంలలో ఒక్కోచోట ముగ్గురేసి చొప్పున పోటీ చేస్తున్నారు.
నేటివరకు ఇండిపెండెంట్లు కీలకం..
హిమాచల్‌ప్రదేశ్‌లో నేటి వరకు జరిగిన ఎన్నికల్లో ప్రతీసారి ఇండిపెండెంట్లే కీలకపాత్ర పోషిస్తున్నారు. 68 స్థానాలున్న హిమాచల్‌లో ఆదివారం జరగనున్న ఎన్నికల్లో 105మంది బరిలో ఉన్నారు. 1967లో.. 147మంది పోటీ చేస్తే 16మంది గెలిచారు. 1972లో 148 మందికి 7గురు ఎన్నికయ్యారు. 1982లో 205మంది పోటీ చేస్తే ఆరుగురే గెలిచారు. 2007 ఎన్నికల్లో 60మంది పోటీ చేస్తే ముగ్గురు విజేతలుగా నిలిచారు.
చరిత్ర కోసం ఒకరు.. అధికారం కోసం మరొకరు..
ప్రేమ్‌కుమార్ సారధ్యంలోని అధికార బిజెపి పంజాబ్ తరహాలో రాష్ట్రంలో చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. పంజాబ్‌లో అకాలీదళ్-బిజెపి కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో మాదిరిగానే హిమాచల్‌ప్రదేశ్‌లోనూ 1977 నుంచి ఒకే పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఆదివారం జరగనున్న పోలింగ్‌లోతోనైనా ఆ ఆనవాయితీ తప్పుతుందా లేక కాంగ్రెస్ ఉత్తరాఖండ్ ఫలితాలను పునరావృతం చేస్తుందా అన్నది తేలాలంటే డిసెంబరు 20వ తేదీ వరకు వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు పలువురు అంటున్నారు. ఇదిలా ఉండగా 2007 ఎన్నికల్లో బిజెపి 41 సీట్లు గెలుపొందగా.. కాంగ్రెస్‌కు 23 సీట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులకు మూడు స్థానాలు దక్కాయి. బిఎస్‌పి ఒక స్థానంలో గెలిచింది. ఎల్‌పిజి సిలిండర్ల పరిమితి, డీజిల్ ధర పెంపు వల్ల ఇంటి బడ్జెట్లు ఎలా తారు మారయ్యాయో చెబుతూ బిజెపి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అంతేగాక ఉచితంగా ఇండక్షన్ హాట్ ప్లేట్లు సరఫరా చేస్తామని వాగ్దానం చూస్తూ ప్రేమ్‌కుమార్ ధుమాల్ 22.31 లక్షల మంది మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదిలాఉంటే స్థానిక కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎల్‌పిజి ధరను మరోసారి హెచ్చించే ప్రయత్నాన్ని చివరి క్షణంలో నిలిపేయించారు. సిమ్లా, కాంగ్రా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిలుపుకుంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే బిజెపి కూడా హమీర్‌పుర్, ఉనా, కులూ, చంబా, నహాన్, సోలన్ తదితర చిన్నపాటి జిల్లాల్లో తన ప్రాభవం నిలబెట్టుకుంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరి లెక్కలు ఎలా ఉన్నా అంతిమతీర్పు మాత్రం ఓటరన్నదే!